31 March, 2026 | 10:12 PM

‘పైగా ప్యాలెస్’కు హెచ్‌ఎండీఏ కార్యాలయం

16-05-2024 12:44 AM

ఆగస్టు వరకు తరలించేందుకు చర్యలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే15 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కార్యాలయాన్ని త్వరలో అమీర్‌పేట నుంచి బేగంపేటకు మార్చనున్నారు. హెచ్‌ఎండీఏ కార్యాలయం మార్పు గురించి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం అమీర్‌పేట స్వర్ణభారతి కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న హెచ్‌ఎం డీఏకు.. నగరంలోని నానక్‌రాంగూడ, లుంబినీ పార్కులలో కూడా కార్యాలయాలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకేచోట నుంచి నిర్వహించాలనే ఉద్దేశంతో బేగంపేటలో చారిత్రాత్మక కట్టడంగా పేరుగాంచిన పైగా ప్యాలెస్‌కు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కార్యాలయాన్ని తరలించే అంశంలో ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ముందుగా పైగా ప్యాలెస్‌లో ఉన్న భవనాలు, అక్కడ ఉండే మౌలిక వసతులను పరిశీలించనున్నారు. ఎలక్ట్రిక్ విభాగంతో పాటు ఐటీ ఉద్యోగులు ఆ భవనంలోని వసతులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పైగా ప్యాలెస్ దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం కార్యాలయం మార్పు ప్రక్రియ జూలై ఆఖరి నాటికి లేదా ఆగస్టు నెలలో పూర్తయ్యే అవకాశాలున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలియజేస్తున్నారు.