3 March, 2026 | 8:30 PM

తుంగతుర్తిలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

03-03-2026 06:51 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి, నాగారం, తిరుమలగిరి మండలాల్లోని గ్రామాల్లో మంగళవారం అన్ని గ్రామాల ప్రజలు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే తమ తమ ప్రాంతాలలో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లలు యువతీ యువకులు మహిళలు పెద్దలు ఒకరిపై ఒకరు, రంగులను చల్లుకొని హోలీ పండుగను జరుపుకున్నారు. చిన్నారులు ఉదయం నుండే చిన్న చిన్న కర్రలతో జాజిరి పాటలు పాడుతూ, జాజిరి ఆటలు ఆడారు.

హోలీ పర్వదినంతో గ్రామాలు కాలనీలన్నీ రంగుల మయంగా మారి యువతి యువకుల్లో సందడి వాతావరణం నెలకొంది. నాయకులు ఒకరు ఒకరు రంగులు చల్లుకొని, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మండల పరిధిలోని ప్రస్తాల గ్రామంలో చిన్నారులు వీరన్న బల్లికోడే వీర గంధం పూసుకుని, కామా కామయ్య వలలో కామా గోళీలు వలలో అంటూ పాటలు పాడుతూ కోలలతో ఆటలాడుతూ జరుపుకున్న హోలీ పండుగ తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ కూడా ఒకటి ప్రతియేటా ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం పౌర్ణమి తిథి రోజు ఈ హోలీ పండుగను జరుపుకుంటారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. వసంత కాలంలో వాతావరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం, జలుబు వస్తాయని, అందుకు సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. సంప్రదాయంగా రంగులను నిమ్మ కుంకుమ పసుపు బిల్వ మోదుగు పూలతో తయారుచేసి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకుంటారు.

కులమత బేధాలు లేకుండా జరుపుకునే ఈ హోలీ పండుగ వసంతకాలపు రాకను, ప్రేమ, ఐక్యత, సంతోషం, పాత గొడవలను మరచి కొత్త బంధాలను ఏర్పరచుకోవడాన్ని సూచిస్తుంది. హోలీ పండుగ సంబరాలలో ఆయా గ్రామాల నూతన సర్పంచులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మల్లెపాక సాయి బాబా, కలకోట్ల మల్లేష్, దాసరి మంజుల శ్రీను, తప్పట్ల ఎల్లయ్య, చిలకల వెంకన్న, మనోజ్, గుండ గాని మహేందర్ గౌడ్, దొంగరి శ్రీను, తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు.