శేఖర్‌కు హానరరీ గ్రాండ్ మాస్టర్ అవార్డు
ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రముఖ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ వ్యవస్థాపకుడు ఎం.సి. శేఖర్ 15వ హానరరీ గ్రాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2026 సందర్భంగా సృ జనాత్మక ఫోటోగ్రఫీ రంగంలో విశిష్ట సేవల కు గుర్తింపుగా టర్కీకి చెందిన అంతర్జాతీయ ఫొటోగ్రామ్ ఫోటో క్లబ్ ఈ అవార్డును ప్రకటించింది.
గత 36 ఏళ్లుగా సహజ కాంతిని ఉపయోగించి గిరిజన సంస్కృతి, జీవనశైలి ని ఫోటోల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఎం.సి. శేఖర్ ఇప్పటికే 1000కుపైగా అంతర్జాతీయ అవార్డులు, 170కుపైగా ఫోటోగ్రఫీ గౌరవాలు అందుకున్నారని తెలిపారు. ఫోటోగ్రఫీని ప్రోత్సహించేందుకు సిగ్మా అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు, వర్క్‌షాప్, సెమినార్లు, ఫోటో పోటీలు నిర్వహిస్తున్నట్లు శేఖర్ తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు తన సేవలను గుర్తించి అత్యున్నత జీవితకాల పురస్కారాలతో సత్కరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.






