రేగాకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ
పినపాక, ఆగస్టు 25, (విజయక్రాంతి): రేగా కాంతారావుకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దు అంటూ పినపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరం వెంకటే శ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏం సాధించారని ఈ ర్యాలీలు? సుమారు నెల రోజులుగా ప్రజల ముందుకు ఎందుకు రాలేదు? ఆరోపణలు వచ్చిన నాటి నుంచి ప్రజలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు బయటకొచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఒక మహిళ చేసిన ఆరోపణలు ఏమిటి? మీ ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలు నిజం కాదా? ఆ మహిళ ఫిర్యాదు మేరకు BNS సెక్షన్ 69, 351(2) కింద కేసు నమోదైనట్లు చెబుతున్న నేపథ్యంలో, ఈ అంశాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీపై లేదా? అని పేరం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక స్థాయి రేగా కాంతారావుకు లేదన్నారు. ఒకప్పుడు బడిపంతులుగా ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మీకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
తప్పుడు కేసులు పెట్టించేంత తప్పుడు మనుషులు మా నాయకులు కాదు. మా నాయకులపై, కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ రేగా కాంతారావు.. చూస్తూ ఊరుకోం. ప్రతి ఆరోపణకు రాజకీయంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా సమాధానం చెబుతాం అని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, పాల్గొన్నారు.






