3 April, 2026 | 9:58 PM

అగ్రనేతలపైనే ఆశలు

02-05-2024 02:05 AM

కరీంనగర్‌లో త్రిముఖ పోటీ

ముమ్మరంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు

నియోజకవర్గంలో పర్యటించనున్న పార్టీల కీలక నేతలు


కరీంనగర్, మే 1 (విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంటులో త్రిముఖ పోటీ నడు స్తోంది. కరీంనగర్ ఉద్యమాల గడ్డనే కాక రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పును ఇస్తుంటారు. కరీంనగర్ పార్లమెంటు నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీజేపీ తరఫున ఎంపీ బండి సంజ య్, బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీ బీ వినో ద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు బరిలో దిగుతున్నారు. నియోజకవ ర్గంలో వీరు ముగ్గురు ముమ్మరంగా ప్రచా రం చేస్తున్నారు.

ఈ ముగ్గురు నేతలు తమతమ పార్టీల అగ్రనేతల ప్రచారంపైనే -ఆశలు పెట్టుకున్నారు. వీరి రాకతో తమకు అనుకూలైన ఫలితం వస్తుందన్న నమ్మకంతో ఉన్నా రు. మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంటలో బస్సు యాత్ర త్వరలో చేపట్టనున్నారు. మరోవైపు జమ్మికుంట లో బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించగా.. ఈ నెల 3న సిరిసిల్లకు రానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనగా ఈసారి వేములవాడ పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 8న జరిగే బహిరంగ సభలో పాల్గొని బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. వేములవాడ రాజన్నను కూడా దర్శించనున్నారు. 

సంజయ్, వినోద్‌కుమార్‌ను ఎంపీలుగా గెలిపించారని, తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అధికారం కోల్పోయి పట్టుకోసం పాకులాడు తున్న బీఆర్‌ఎస్ పార్టీ.. కరీంనగర్‌పై ప్రత్యేక 

దృష్టి సారించాయి. కరీంనగర్ పార్లమెంటు నుంచి 2014లో బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపొందగా 2019లో బండి సంజయ్ గెలుపొందారు. వెలిచాల రాజేందర్‌రావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీగా -పోటీ చేసి లక్షా 75 వేల ఓట్లు సాధించారు. మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడిగా రాజేందర్‌రావుకు కూడా నియోజకవర్గంలో పట్టు ఉండటంతో కరీంనగర్‌లో త్రిముఖ పోటీ అనివార్యమైంది.

అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా తీర్పు!

అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా నాలుగింటిలో కాంగ్రెస్, మూడింటిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ప్రస్తుతం -ఓటర్ల తీర్పు భిన్నం గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు గత పార్లమెంటు ఎన్నికలే ఉదాహరణ. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలవగా ఎంపీగా మాత్రం బండి సంజయ్ విజయం సాధించారు. ఈ సారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సగమేసి బలం ఉంది. ఇది ఈ ఎన్నికలకు పనికి వస్తుందా గత తీర్పే పునరావృతం అవుతుందా చూడాలి. 

అసెంబ్లీలో ఒక సీటు ఎక్కువగా కాంగ్రెస్ గెలిచినా ఓట్లలో మాత్రం బీఆర్‌ఎస్ కంటే వెనకబడే ఉంది. బీజేపీకి ఒక్క సీటు దక్కకపోయినా రెండున్నరలక్షల ఓట్లు సాధించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఫలితాలను ఆధారంగా చేసుకొని ఆయా నియోజకవర్గంలో లీడ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్, మోదీ హవా తో బీజేపీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా బీఆర్‌ఎస్ ముందుకు పోతున్నాయి.