25 July, 2026 | 8:57 PM

అధిక వడ్డీ ఆశ చూపి రూ. 200 కోట్లతో పరారైన నిందితుల అరెస్ట్

31-05-2024 01:31 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజయక్రాంతి): అమాయక ప్రజలను మాయ మాటలు చెప్పి నమ్మించి రూ. 200 కోట్లతో  పరారైన శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీప్రియాంక గ్రాఫ్‌టెక్ ప్రైవేట్ లిమిటేడ్, రిపోర్ట్స్ ఎక్స్‌ప్లిడ్, ప్రొప్రెటర్, డైరక్టర్లను సెంట్రల్ క్రైమ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాధితులు బాలచంద్ర, ఇతరుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ స్టేట్ కో అపెక్స్ బ్యాంక్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల ఆమె భర్త మేక నేతాజీ వారి కుమారుడు మేకా శ్రీహర్ష తమ సంస్థలో పెట్టుబడులు పెడితే 24శాతం వడ్డీతో కలిపి చెల్లిస్తామని, తప్పుడు హామీలతో 532 మంది బాధితులను మోసగించి రూ. 200 కోట్లు కాజేసి పరారయ్యారు. 1985లో మేకా నేతాజీ మొదట్లో శ్రీప్రియాంక ఫైనాన్స్, చిట్‌ఫండ్స్‌ను స్థాపించి రోజువారీ చిట్‌ఫండ్ కార్యకలపాలను నిర్వహించినట్లు, అనంతరం ప్రింటింగ్ మెటీరియల్స్ వ్యాపారం చేయడానికి శ్రీప్రియాంక గ్రాఫ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ జీడిమెట్లలో ఏర్పాటు చేశాడు.

ఈ క్రమంలో వారికి తెలిసిన వారి నుంచి బ్యాంకు సిబ్బందితో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులు ఏ2 మేకా నేతాజీ, ఏ3 మేకా శ్రీహర్ష, ఏ4 నిమ్మగడ్డ వాణిబాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఏ1 నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టిన రూ. 200కోట్లు ఏం చేశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.