17 April, 2026 | 4:56 PM

ఉద్యాన వాణిజ్య పంటలను సాగు చేయాలి

14-06-2025 12:05 AM

కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్లగొండ టౌన్, జూన్ 13 :  రైతులు వ్యవసాయం ద్వారా మంచి లాభాలు సంపాదించేందుకు ఎప్పుడూ పండించే సాధారణ పంటలు కాకుండా, ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. 

ఈ పంటల వల్ల అధిక దిగుబడి, ఆదాయం  వస్తుందని అన్నారు.ముఖ్యంగా ఇటీవలి కాలంలో పలువురు రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారని, నల్గొండ జిల్లాలో  విభిన్న పంటలను పండించి అధిక ఆదాయం ఆర్జిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం,అంతాయ గూడెం లో రైతు కమలాకర్ రెడ్డి సాగు చేస్తున్న ‘అంజీర‘తోటను పరిశీలించారు. జీర ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారని?  పండిన పంటను ఎక్కడ అమ్ముతున్నారని? మార్కెట్ ఉందా? నీటి సౌకర్యం ఉందా? ఫామ్ పాండు ఏమైనా నిర్మించుకున్నారా ?   బ్రాండింగ్ ,మార్కెటింగ్ ,తదితర వివరాలను  అడిగి తెలుసుకున్నారు.

తొమ్మిది ఎకరాలలో అంజీర సాగు చేశామని, ప్రస్తుతం ఇది మొదటి పంట అని, 15 నెలలు అవుతున్నదని, ఈ జనవరి నుండి దిగుబడి  మొదలయిందని, ఒక ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, డ్రిప్ పద్ధతిలో నీళ్లు అందిస్తున్నామని, ప్రస్తుతం ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి వస్తున్నదని,  సరాసరి ఎకరాకు లక్ష ఇరవై వేల రూపాయల లాభం వస్తున్నదని ,స్థానిక మార్కెట్ తోపాటు,

చెన్నై, బెంగళూరు వంటి పట్టణాలకు పంపిస్తున్నామని, గతంలో వాటర్ మిలన్, బొప్పాయి,వంకాయ వంటి పంటలు పండించడం జరిగిందని, ఇప్పుడు వాటికి బదులుగా అంజీర తోటను పెంచుతున్నట్లు  తెలిపారు. ఆమె వెంట జిల్లా ఉద్యానశాఖ అధికారి అనంత రెడ్డి,తహసిల్దార్ పరశురాం,ఇతర అధికారులు ఉన్నారు.