7 August, 2026 | 7:56 AM

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు

21-06-2024 01:09 AM
  • ఇల్లు, వైద్య సౌకర్యాలను ఉచితంగా కల్పించేందుకు కృషి
  • మా ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శను స్వీకరిస్తుంది.. 
  • టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభల 
  • ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

ఖమ్మం, జూన్ 20(విజయక్రాంతి): అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు. ఖమ్మంలో గురువారం రెండో రోజు నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. పత్రికల యాజమాన్యాల ఆలోచనలు ఎలా ఉన్నా, జర్నలిస్టు మాత్రం ఉన్నతమైన ఆలోచనలతో సమాజానికి మేలు చేసే వార్తలు రాయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.  నిర్మాణాత్మక విమర్శను తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని ప్రకటించారు.

మీడియా భద్రత కోసం ఒక చట్టాన్ని తీసుకరావాలని రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచనతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. ఆ చట్టాన్ని తెచ్చేందకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ, జాతీయ నాయకుడు దేవులపల్లి అమర్, ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.

పత్రికల స్థానం చెక్కు చెదరలేదు : మంత్రి తుమ్మల 

సోషల్ మీడియా విజృంభిస్తూ, సాంకేతికత తన పరిధులు విస్తరించుకుంటున్నప్పటికీ సమాజంలో పత్రికల స్థానం చెక్కు చెదరలేదని, వాటి విశ్వసనీయత ఏమాత్రం తగ్గలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. జర్నలిస్టులు ప్రజాహితం కోసం పాటుపడాలన్నారు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతో జర్నలిస్టులతో సత్సంబంధాలు కొనసాగించానన్నారు.  రాజకీయ పార్టీల ఒత్తిళ్లతో పత్రికల యాజమాన్యాలు ఆంక్షలు పెడతాయని, అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలన్నారు. కరోనా సమయంలో మీడియా ఎంతో కీలకంగా పనిచేసిందని, నాటి తెగువ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

జర్నలిస్టులకు కనీస వేతనాలు ఇవ్వాలి : ఎమ్మెల్యే కూనంనేని

జర్నలిస్టులకు కనీస వేతనం ఇచ్చేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టు వృత్తిలో ఉన్నవారు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. గ్రామీణ జర్నలిస్టు నుంచి పట్టణాల్లో పని చేస్తున్న వారి వరకు ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందన్నారు.  ఈ సందర్భంగా తాను ‘విశాలాంధ్ర’లో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. 

భూములు అప్పగిస్తామని కలెక్టర్ హామీ 

ఖమ్మం జర్నలిస్టులకు సంబంధించిన 147 జీవో ప్రకారం జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూమిని పది రోజుల్లో సొసైటీకి అప్పగిస్తామని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హామీ ఇచ్చారు.  జర్నలిస్ట్ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతృత్వంలో ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ను కలిసి గతంలో జరిగిన పరిణామాలను వివరించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

మహాసభల్లో 10 తీర్మానాలకు ఆమోదం

మహాసభల్లో కార్యవర్గం పది తీర్మానాలను ప్రవేశపెట్టగా ప్రతినిధులు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజిత ప్రవేశపెట్టారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలనే తీర్మానాన్ని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి, వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్, వేజ్ బోర్డును పునరుద్ధరించాలనే తీర్మానాన్ని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సంపత్, వృత్తి కమిటీలను పునరుద్ధరించాలనే తీర్మానాన్ని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించాలనే తీర్మానాన్ని వరంగల్‌కు చెందిన రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు వి.రమణ, గ్రామీణ విలేకరులకు వేతనం చెల్లించాలనే తీర్మానాన్ని యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు వంశీ, ఉర్దూ పత్రికలను ప్రోత్సహించాలనే తీర్మానాన్ని మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్‌చారి, చిన్న పత్రికలను ఆదుకోవాలనే తీర్మానాన్ని స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు విద్యాసాగర్, జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలనే తీర్మానాన్ని వరంగల్ జిల్లా అధ్యక్షుడు జి.మధు గౌడ్, జర్నలిస్టుల అవార్డులను పునరుద్ధరించాలనే తీర్మానాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేంద్ర కుమార్ ప్రవేశపెట్టారు.