7 August, 2026 | 1:13 AM

యెమెన్‌లో హౌతీల దాడులు

07-08-2026 12:15 AM

- 30 మంది యెమెన్ సైనికులు మృతి

- 50 మందికి పైగా గాయాలు

కైరో, ఆగస్టు 6: మధ్య, తూర్పు యెమెన్‌లో గురువారం హౌతీలు చేసిన దాడుల్లో 30 మంది ప్రభుత్వ సైనికులు మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారని యెమెన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మారిబ్, హధ్రమావత్ ప్రావిన్సు లలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ బలగాల శిబిరాలపై ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. హౌతీల తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తుంది.

సౌదీతో ఏప్రిల్ 2022లో యెమెన్‌లో కుదిరిన ఒప్పందం తర్వాత ఈ దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. హౌతీలు తమ శిబిరాలపై దాడి చేశారని యెమెన్ సైన్యం తెలిపింది. ఈ ప్రావిన్స్‌లలో పలు కీలక సైనిక క్యాంపులను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణి, డ్రోన్లను ప్రయోగిం చారు. ప్రభుత్వ అత్యవసర బలగాలు, స్థావరాలపై దాడులు జరిగాయి. దీంతో తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు ధ్రువీకరించారు.

క్షిపణుల భీకర దాడుల్లో 30 మందికి పైగా సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. 50 మంది సైనికులకు తీవ్రగాయాలైనట్లు పేర్కొంది. యెమెన్ ఆరోగ్య మంత్రి ఖాసిమ్ బహిబా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మారిబ్, హద్రామౌత్ ఆసుపత్రులను ఆదేశించారు. సౌదీ అరేబియా బలగాల కదలికలను ఆపడానికే ఈ ఆపరేషన్ చేపట్టామని హౌతీవర్గాలు తెలిపాయి.

తూర్పు యెమెన్‌లో సౌదీ మద్దతుగల బలగాల సమీకరణకు ప్రతిస్పందనగా మారిబ్, హద్రామౌట్ ప్రావిన్సులలోని శిబిరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు హౌతీ బ్రిగేడియర్ జనరల్ యహ్యా సరీ తెలిపారు. ఈ దాడులలో ‘వందలాది మంది సౌదీ శత్రు కిరాయి సైనికులు’ మరణించారని, గాయపడ్డారని పేర్కొన్నారు. శిబిరాలు, డిపోలు, సైనిక వాహనాలు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని, తగలబడ్డాయని ఆయన తెలిపారు.