7 August, 2026 | 1:24 AM

ఆధార్ లేక.. చదువులకు దూరమవుతున్న ‘గిరి’ పిల్లలు..

07-08-2026 12:15 AM

బర్త్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి నిరీక్షణ...

అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారానికి దూరం...

ఆదిలాబాద్ / ఉట్నూర్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ఈ చిత్రంలో ఉన్న ఇద్దరు పిల్లలు ఇంద్రవెల్లి మండలం దొడందా కొలం గూడకు చెందిన అక్క, తమ్ముడు కుంర్రా లక్ష్మి, కుంర్రా సురేష్ లు. బర్త్ సర్టిఫికెట్ కోసం మీసేవ కేంద్రం ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 12న దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసి ఆరు నెలలు గడిచినా నేటికి రెవెన్యూ శాఖ ద్వారా బర్త్ సర్టిఫికెట్ అందడం లేదు.

గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయుడు ఆ ధార్ కార్డు తీసుకురావాలని, లేదంటే రిజిస్టర్ లో పేరు నమోదు కాదని చెబుతు న్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బర్త్ సర్టిఫికెట్ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

సిరికొండ మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో బడీడు పిల్లలతో పాటు ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 32 మంది ఉ న్నారు. వీరిలో ఇద్దరికీ మాత్రమే ఆధార్ కా ర్డులు ఉన్నాయి. పాఠశాలలో విద్యను అభ్యసించే పది మంది విద్యార్థుల్లో కేవలం ఇద్ద రికీ మాత్రమే ఆధార్ కార్డు ఉన్నాయి. మిగ తా వారికి ఆధార్ కార్డులు లేవు. అంగన్వాడి కేంద్రంలో 22 మంది పిల్లలకు ఆధార్ కార్డు లేక పౌష్టికాహారం అందడం లేదు. 22 మం ది పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ లేక ఆధార్ కార్డు పొందడానికి వీలు కలగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

అదిలాబాద్ జిల్లాలో ని మారుమూల గిరిజన గ్రామాల పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లతోపాటు ఆధార్ కార్డు లేక చ దువులకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ని ముఖ్యంగా కొలాం గిరిజన పిల్లలకు ఆధా ర్ కార్డులతో పాటు బర్త్ సర్టిఫికెట్ లేక అంగన్వాడి కేంద్రాల్లో ప్రతిరోజు అందించే పౌష్టి కాహారానికి సైతం దూరమవుతున్నారు. బర్త్ సర్టిఫికెట్ల కోసం కొంతమంది మీసేవ కేంద్రా ల ద్వారా దరఖాస్తులు చేసుకొని నెలలు గ డుస్తున్నా వారికి సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో ఆధార్ కార్డులను తీసుకోలేక పోతున్నారు.

ఆధార్ కార్డు పొందాలంటే బర్త్ సర్టిఫికెట్ తో పాటు గ్రామ పంచా యతీ కార్యదర్శి ధ్రువీకరించాల్సి ఉంది. కానీ పంచాయతీ కార్యదర్శులు పాప జన్మించిన ఆసుపత్రి నుంచి బర్త్ సర్టిఫికెట్ తీసుకొస్తే పంచాయతీ నుంచి ధ్రువీకరించి సర్టిఫికెట్ ఇస్తామంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలలో ఇదే పరిస్థితి ఉన్నట్లు గిరిజనులు వా పోతున్నారు. ప్రసూతి సమయంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు 108 అంబులెన్స్ లో తీసుకువెళ్లి అక్కడ ప్రసూతి అయిన తర్వాత పాపతో పాటు తల్లిని గ్రామాలకు తీసుకొచ్చి వదిలేస్తున్నారు.

ఆ సమయంలో బర్త్ సర్టిఫికెట్ విషయం తెలియని అమాయక గిరిజనులు బాబు, పాప పుట్టినట్లు సర్టిఫికెట్లను తీసుకోవడం మర్చిపోతున్నారు. పాఠశాలలో చే ర్పించిన సమయంలో పాఠశాలల ఉపాధ్యాయులు ఆధార్ కార్డు కావాలని తెలపడంతో ఆధార్ కార్డు కోసం రేషన్ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు. ఆధార్ సెంటర్ కు వెళ్తే బర్త్ సర్టిఫికెట్ తీసుకువస్తే ఆధార్ కార్డు తీసుకోవచ్చని తెలపడంతో అమాయక గిరిజ నులు బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ దొరుకుతుందని తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటు న్నారు. జీరో నుంచి ఐదు సంవత్సరాల వర కు అంగన్వాడి కేంద్రాలలో ప్రతిరోజు ఇచ్చే పౌష్టికాహారానికి సైతం వారు దూరమవుతున్నారు.

ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా ఉన్నతా ధికారులు ఆధార్ కార్డు లేక చదువులతో పాటు, పౌష్టికాహారానికి దూరమవుతున్న గిరిజనుల పిల్లలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కొలాం గిరిజనులు కోరుతున్నారు. ఈ విష యమై ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్ ను ‘విజయ క్రాంతి’ వివరణ కోరగా డివిజన్ స్థాయిలో బర్త్ సర్టిఫికెట్లను ఆపడం లేదు. ఆసుపత్రిలో పుట్టినట్లు, గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి సర్టిఫికెట్ తీసుకొని మీసేవ ద్వారా దరఖాస్తు రాగానే వెంటనే పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఐదవ తరగతి వరకే చదివి వ్యవసాయ పనుల్లోకి 

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పూత గూడ గ్రామానికి చెందిన టేకం దివ్య గ్రామంలోని శాటిలైట్ గిరిజన పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకుంది. ఆరవ తరగతి చదివేందుకు ఆశ్రమ పాఠశాలకు వెళితే ఆధార్ కార్డు తీసుకుని వస్తే చేర్చుకుంటామని పాఠశాల నిర్వాహకులు తెలపడంతో చదువు మానేసి తల్లిదండ్రులతో వ్యవసాయ పనులకు వెళుతుంది. ఈ బాలికకు ఆధార్ కార్డు ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

టేకం దివ్య, పోతాగూడ (2), ఆదిలాబాద్ రూరల్ మండలం

బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలి... 

తమ గ్రామంలో 30 మంది చిన్నారులకు బర్త్ సర్టిఫికెట్లు లేవు. బర్త్ సర్టిఫికెట్ల కోసం రిమ్స్ ఆసుపత్రి వెంట తిరిగినా పట్టించుకునే వారు లేరు. ఇప్పటికైనా కొలం గిరిజన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బర్త్ సర్టిఫికెట్లు అందజేస్తే, ఆధార్ కార్డులు తీసుకుంటారు. అధికారులు ఈ విషయంలో దృష్టి సారించి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించి ఆథార్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థుల చదువుకు దోహదపడాలి.

సీడం మారుతి, కారోబారి, ముత్యంపేట, సిరికొండ మండలం

ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం... 

గిరిజనులకు బర్త్ సర్టిఫికెట్ల మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఆసుపత్రుల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోకపోవడం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గిరిజన గూడాల్లో, గ్రామాల్లో ఆధార్ కార్డు లేని పిల్లలను ఆయా మండలాల రెవెన్యూ అధికారుల సమక్షంలో గుర్తించి, ఆ చిన్నారులు డెలివరీ అయిన ఆసుపత్రుల నుంచి సర్టిఫికెట్లు తీసుకువచ్చే విధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అందరికి ఆథార్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క చిన్నారి పౌష్టికాహారానికి దూరం కాకుండా, విద్యకు దూరం కాకుండా అధికారులతో కలిసి పని చేస్తాం.

మంద మకరందు, ఐటీడీఏ పీఓ, ఉట్నూర్