హోమ్‌స్టేల అభివృద్ధి పర్యాటకానికి ప్రోత్సాహం
- ఐదు ప్రాజెక్టులకు రూ. 17.52 కోట్లు
- రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రశ్న
- కేంద్రమంత్రి గజేంద్రసింగ్ ప్రకటన
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): స్వదేశ్ దర్శన్2.0లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టేల అభివృద్ధి, స్థానిక ప్రజలకు శిక్షణ, సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తెలిపారు. 2025--26లో ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి క్లస్టర్ అభివృద్ధికి రూ.1.23 కోట్ల ప్రాజెక్టు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, లడఖ్, మధ్యప్రదేశ్, మిజోరం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మొత్తం రూ.17.52 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ సమాధానమిచ్చారు. భారతదేశాన్ని ప్రపంచస్థాయి వైద్య, వెల్నెస్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జాతీయవ్యూహం, రోడ్‌మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.
పర్యాటకంపై ప్రచార చిత్రాలు రూపొందించడం, యోగా, ఆయుర్వేదం, వెల్నెస్ సేవలను డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ వంటి ప్రపంచస్థాయి వైద్య సేవల కేంద్రాల సామర్థ్యాన్ని కూడా వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. 2024లో సిటీ ఎంఐసీఈ మార్గదర్శ కాలను రూపొందించి రాష్ట్రాలు, కేంద్ర పాలి త ప్రాంతాలకు పంపినట్లు మంత్రి తెలిపారు.
దేశీయ, అంతర్జాతీయ సదస్సులు, వ్యా పార సమావేశాలను ఆకర్షించేందుకు ఎంఐసీఈ మౌలిక సదుపాయాలు, సేవలను బలోపేతం చేయాలని రాష్ట్రాలను కోరినట్లు, అలాగే దేశంలోని ప్రధాన ఎంఐసీఈ కేంద్రాల వివరాలతో డిజిటల్ ఎంఐసీఈ కేటలాగ్‌ను కూడా సిద్ధం చేసినట్లు గజేంద్రసింగ్ షేకావత్ స్పష్టం చేశారు.






