బీజేపీకి అన్ని ఓట్లు ఎలా?
మహబూబాబాద్‌పై సమీక్ష పూర్తి
పాలమూరులో ఓటమిపై ముఖ్యమంత్రి రేవంత్ అసంతృప్తి
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలతో సమీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన, ఓడిన నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు వచ్చిన ఓట్లపై పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గి, బీజేపీకి అధికంగా ఎలా వచ్చాయన్న విషయంపై లోతుగా చర్చించనున్నట్టు తెలిసింది.
ప్రత్యేకించి సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ఓడిపోవటంపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఇందులో రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు వచ్చినప్పటికి నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో బీజేపీకి మెజార్టీ ఓట్లు వచ్చాయి.
ఇందుకు కారణాలను సమావేశంలో అన్వేషించనున్నారు. మహబూబా బాద్ నియోజకవర్గానికి సంబంధించి గురువారం సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరామ్‌నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనగామ మినహా మిగతాచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడు లక్షలకు పైచిలకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2 లక్షల మెజార్టీకే పరిమితమైంది. మిగతా లక్ష ఓట్లు బీజేపీకి వెళ్లాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. వీటితోపాటు దిలాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, నిజామాబాద్ తదితర నియోజకవర్గాలపైనా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.






