ఇది ఆరంభమే
రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ
6 నెలల్లోనే సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..
ఢిల్లీలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి
* 6 నెలల తమ పాలన రెఫరెండం అని ప్రకటించుకున్న కాంగ్రెస్ కేవలం ఒక్క శాతం ఓటును మాత్రమే అదనంగా పొందింది. 6 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. బీజేపీ ఓటు శాతం మాత్రం రెండున్నర రెట్లు పెరిగింది. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోయింది.
జీ కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ర్టంలో బీజేపీ ఎదుగుదలకు పార్లమెంట్ ఎన్నికలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింత బలీయ మైన శక్తిగా మారుతామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బీజేపీని ప్రజలు ప్రత్యమ్నాయంగా భావిస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ గణనీయ మైన సీట్లు పొంది సత్తా చాటిందని సంతోషం వ్యక్తంచేశారు. గతం కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు సంపాదించామని అన్నారు. సమైక్య ఏపీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఏనాడూ బీజేపీ 8 ఎంపీ సీట్లు సాధించలేదని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ గెలుపు మోదీపై ప్రజల ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.
6 నెలల తమ పాలన రెఫరెండం అని ప్రకటించుకున్న కాంగ్రెస్ కేవలం ఒక్క శాతం ఓటును మాత్రమే అదనంగా పొందిందని, 6 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. బీజేపీ ఓటు శాతం మాత్రం రెండున్నర రెట్లు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ 14 చోట్ల 3వ స్థానానికే పరిమితమైందని, 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు.
బీజేపీ ఎదుగుదలకు ఆరంభం
ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం మాత్రమేనని కిషన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో తమ పార్టీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారని, రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసి బీజేపీ కార్యకర్తలను బెదిరించినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని పేర్కొన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ దాదాపు 3.5 లక్షల మెజారిటీతో గెలిచారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లాలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచారని.. గజ్వేల్, సిద్దిపేట, మెదక్‌లో బీఆర్‌ఎస్ వందల కోట్లు ఖర్చుపెట్టినా బీజేపీయే ఘన విజయం సాధించిందని చెప్పారు.
నిజామాబాద్‌లో పసుపుబోర్డు విషయంలో ఎన్నో విమర్శలు చేశారని.. అయినా ప్రజల బలంతో అర్వింద్ ఘన విజయం సాధించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారి ప్రచారం చేసినా ప్రజలు బీజేపీ వైపే నిలిచారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించిందని చెప్పారు. ఈ పరిస్థితులను సద్వినియో గం చేసుకొని మరింతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచిన మరో 6 చోట్ల కూడా ఓట్ల తేడా చాలా తక్కువగా ఉందని చెప్పారు.
కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్
కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ సికింద్రాబాద్‌లో పనిచేసిందని కిషన్‌రెడ్డి విమర్శిం చారు. నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ బలహీనపడటం, ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తున్న పరిస్థితుల్లో రాష్ర్టంలో రాజకీయ శూన్యత నెలకొందని అన్నారు. రాష్ర్టంలో పరిస్థితులు మారుతాయని, సోనియమ్మ, ఇందిరమ్మ పాలన తెస్తామని సీఎం ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారని విమర్శించారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికలకు అవసరమైన డబ్బులను వసూలు చేసిందని ఆరోపించారు. ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప ఇతర హామీలేవీ అమలుకావడం లేదని, ఇచ్చిన హామీల అమలుకు వనరులను ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు, పురందేశ్వరి, పవన్‌కల్యాణ్ ఎన్డీయే కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించిందని అభినందించారు.






