21 August, 2026 | 1:41 AM

సద్గుణాల స్వరూపమే వరలక్ష్మి

21-08-2026 12:00 AM

శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వ్రతాలు, నోములు, పూజలు.. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో వరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు స్కాంద పురాణం పేర్కొంటోంది.

భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తం లో ప్రస్తావితమై ఉన్నాయి. శ్రావణమాసంలో మొత్తం నాలుగు శుక్రవారాలు ఉన్నప్పటికీ, ఎక్కువమంది శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆరోజు చేసుకోలేనివారు నాలుగు వారాల్లో ఏదో ఒక వారం వరలక్ష్మీవ్రతాన్ని చేసుకుంటారు. కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీస్వరూపమైన సద్గుణాలు.

ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీవ్రతం. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీవరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఈ కథను చెప్పారు. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు. లక్ష్మీదేవి ధన, ధాన్య, పశు, గుణ, జ్ఞాన సంపద మొదలైన ఎన్నో సంపదలనిచ్చే తల్లి. వరలక్ష్మీవ్రతం వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. 

 కామిడి సతీష్‌రెడ్డి, 9848445134