calender_icon.png 18 July, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ క్వశ్చన్ పేపర్ ఎలా?

17-07-2025 01:26:27 AM

- ఈసారి వంద మార్కులకు పేపర్ అని గతంలోనే నిర్ణయం

- దానికనుగుణంగా ఇంకా సిద్ధం చేయని బ్లూప్రింట్

- 75 మార్కులు థియరీ, 25 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలివ్వాలని యోచన

- కసరత్తు చేస్తున్న అధికారులు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): పదో తరగతి ప్రశ్నాపత్రం ఎన్ని మార్కులకు ఉంటుందో, ఎలా ఉంటుందో అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గత విద్యాసంవత్సరంలో పదో తరగతిలో 80 మార్కులకు వార్షిక పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉండేవి. అయితే ఈ విధానంలో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇంటర్నల్స్‌కు 20 మార్కులు తీసేసి వార్షిక పరీక్షలను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తామని విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది.

కానీ ఇంటర్నల్స్ యథాతధంగా ఉంటాయని ప్రకటించింది. ఇంటర్నల్స్‌ను నిర్వహించినా దానికి సంబంధించిన మార్కులను వార్షిక పరీక్షల్లో పరిగణలోకి తీసుకోబోమని జూన్‌లో విద్యాశాఖ ప్రకటించింది. అయితే గతంలో 80 మార్కులకు ఉన్న ప్రశ్నపత్రాలు...తాజా విధానంతో అవి మారుతాయి.

100 మార్కులకు నూతన ప్రశ్నపత్రాలను  ఈ విద్యాసంవత్సరం రూపొందించాల్సి ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రమెలా ఉం టుందనే దానిపై స్పష్టత లేదు. వ్యాసరూప ప్రశ్నలెన్ని ఉంటాయి? ఆబ్జెక్ట్ టైపు ప్రశ్నలెన్ని?  ఛాయీస్‌లు ఏవిధంగా ఉంటాయి? అన్న అంశంపై అధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

75 మార్కులు థియరీ, 25 బిట్ పేపర్!

100 మార్కులకు బ్లూప్రింట్ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ) పరీక్షలను అక్టోబర్ 24 నుంచి 31 వరకు నిర్వహించాల్సి ఉంది. అంతలోపే ప్రశ్నాపత్రాల బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాలి. కానీ ఇంతవరకు బ్లూప్రింట్ విడుదల చేసిన దాఖలాల్లేవు. అసలు ప్రశ్నపత్రం ఎలా ఉంటుందనే అంశంపై ఉపాధ్యాయుల్లోనూ గందరగోళం నెలకొంది.

ప్రశ్నాపత్రం అసలు పాత పద్ధతిలో ఉం టుందా? లేదంటే కొత్త పద్ధతా అంటూ హెచ్‌ఎంలు, ప్రైవేట్ పాఠశాల కరస్పాండెం ట్లు విద్యాశాఖ అధికారులను ఆరా తీస్తున్నారు. ముందుగా బ్లూ ప్రింట్ విడుదల చేస్తేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తీరా పరీక్షలకు ముందు హడావిడిగా ఇస్తే విద్యార్థులు గందరగోళానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. పలుమార్లు ఇప్పటికే బ్లూప్రింట్ రూపకల్పనపై సమావేశాలు నిర్వహించిన ఎస్సీఈఆర్టీ అధికా రులు...75 మార్కులకు థియరీ, 25 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలివ్వాలని ఓ అభి ప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకో దఫా చర్చించనున్నారు. ఆతర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.