17-07-2025 01:27:25 AM
గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు
మహబూబాబాద్, జూలై 16 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినిలకు కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వసతులు ఏవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ప్రాథమికంగా తమ విచారణలో వెల్లడైనట్లు ఏసీబీ డీఎస్పి సాంబయ్య వెల్లడించారు.
గత కొంతకాలంగా ఆశ్రమ పాఠశాలలో నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతున్నారని, సరైన మెనూ అమలు చేయడం లేదని, విద్యార్థినుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం సివిల్ సప్లై విజిలెన్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల అధికారుల సమక్షంలో ఆశ్రమ పాఠశాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో నిర్వహణ లోపం ఉందని, విద్యార్థులకు సరైన మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, సౌకర్యాలు అన్ని పూర్తిగా గాలికి వదిలేసారని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. విద్యార్థులను హాస్టల్ నుండి బయటకు పంపేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన అవుట్ రిజిస్టర్ కూడా రాయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.
రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, హాస్టల్ నిర్వహణకు గిరిజన కోఆపరేటివ్ సొసైటీ నుండి వచ్చిన సరుకుల్లో నాణ్యత, ప్రతి విద్యార్థికి ప్రతిరోజు అందించాల్సిన మెనూ, సౌకర్యాలు, వసతులపై నిర్వాహకుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అలాగే జిసిసి నుంచి గురుకులానికి వచ్చిన సరుకుల నాణ్యత పరిశీలించడానికి వివిధ రకాల ఆహార వస్తువుల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపుతున్నట్లు డిఎస్పి వెల్లడించారు.