9 July, 2026 | 2:34 AM

ఇంకెంత మంది చనిపోవాలి?

09-07-2026 01:48 AM
  1. ఎన్‌హెచ్-44పై ఫ్లైఓవర్లు నిర్మించాలి
  2. కలెక్టర్‌కు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వినతి

మెదక్, జులై 8 (విజయక్రాంతి) : జాతీయ రహదారి-44పై రామాయంపేట సమీపంలోని ఆద్య హోటల్ జంక్షన్, దామర చెరువు బైపాస్ వద్ద ఫ్లైఓవర్లు లేకపోవడంతో వరుసగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

బుధవారం రామాయంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..జాతీయ రహదారిపై రోడ్డు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హైవేపై అధిక వేగంతో వాహనాలు ప్రయాణించడం, రోడ్డు ఎత్తుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ‘ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వాలు స్పందిస్తాయి‘ అంటూ ప్రశ్నించారు.

గత ఐదు నెలల్లోనే ఈ ప్రాంతంలో సుమారు 45 రోడ్డు ప్రమాదాలు జరిగి 35 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆద్య హోటల్ జంక్షన్, దామర చెరువు బైపాస్ వద్ద వెంటనే సాంకేతిక సర్వే నిర్వహించి ఫ్లైఓవర్ లేదా బైపాస్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.

అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాత్రావు, పీఎసీసీఎస్ చైర్మన్ చంద్రం, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్లు కొక్కు ప్రవీణ్ చౌదరి చరిత, మాధవి రమేష్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కౌన్సిలర్లు మోహన్ తదితరులు పాల్గొన్నారు.