calender_icon.png 18 June, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ చేయడానికి ఎంత సమయం?

18-06-2025 12:40:56 AM

- టెహ్రాన్‌లో జనాభా కోటికి పైగానే

- ట్రంప్ హెచ్చరికలతో నగరాన్ని వీడుతున్న ప్రజలు

- అన్ని దారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

టెహ్రాన్, జూన్ 17: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్షణమే టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో జనం పెద్ద సంఖ్యలో నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బుధవారానికి టెహ్రాన్ నగరం దాదాపు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. టెహ్రాన్ జనాభా దాదాపు కోటికి పైగానే ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ మొత్తం జనాభాతో సమానమని చెప్పొచ్చు. ఇంతమందిని ఖాళీ చేయించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఎలా అన్నది అంతుచిక్కని ప్రశ్న.

మొత్తం టెహ్రాన్ నగరం ఖాళీ అవ్వడానికి ఎంత సమయం పడుతుందన్నది కూడా కచ్చితంగా చెప్పలేం. ఇరాన్ ప్రభుత్వం మాత్రం నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటివరకు 224 మంది మృతి చెందగా.. 1200లకు పైగా గాయపడ్డారు. దీంతో ప్రాణభయంతో టెహ్రాన్‌లో నివాసముంటున్న వారంతా తమకు అనుకూలంగా ఉన్న ప్రయాణ మార్గాల్లో నగరాన్ని వీడుతున్నారు.

టెహ్రాన్ నుంచి పశ్చి మ దిశగా వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. వీరిలో చాలా మంది కాస్పియన్ సముద్ర ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టెహ్రాన్‌లోని పురాతన గ్రాండ్ బజార్ సైతం మూతపడడం భయాందోళనకు అద్దం పడుతోంది. టెహ్రాన్‌లోని గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాల పొడవాటి క్యూలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఇరాన్ యుద్ధ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే దర్శనమి చ్చా యి. అయితే ఇరాన్‌లో బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందు కు బంకర్ లాం టి ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

ఖాళీ అయ్యేవరకు చర్యలుండవా?

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను కోరుకోవడం లేదని.. యుద్ధానికి నిజమైన ముగింపు కావాలని పేర్కొన్న ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే అమెరికా చేరుకున్న ట్రంప్ సిట్యూయేషన్ రూమ్‌లో ఇరాన్‌పై ఎలా దాడులకు దిగాలన్న దానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇరాన్ ప్రజలంతా టెహ్రాన్ వీడేవరకు ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. టెహ్రాన్ ఖాళీ అవ్వడానికి 18 నుంచి 24 గంటల సమయం ఉండడంతో ట్రంప్ తన కార్యచరణను కాస్త వెనక్కి జరిపే అవకాశముంది.