కాంగ్రెస్‌లో గెలిస్తేనే..
పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికే మంత్రి పదవులు
పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణపై చర్చలు
ఎవరికి ఇవ్వాలనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారు
పదవుల పంపకంలో సామాజిక న్యాయం
మహిళలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే స్వాగతిస్తా
పార్టీ ఫిరాయింపులు తెలంగాణలోనే లేవుగా?
రుణమాఫీ పంట రుణాలకే.. బంగారం రుణాలకు కాదు
మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కమిషన్
బీసీ కమిషన్‌కు కొత్త చైర్మన్ వచ్చాక కుల గణన
ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బీ ఫాం మీద ఎన్నికల్లో గెలిచిన వాళ్లకే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ రెండు అంశాలపై ఒకేసారి నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ రేసులో కాంగ్రెస్‌లోని ఎవరైనా ఉండొచ్చని, ఈ ఎంపికలో సామాజిక న్యా యం తప్పనిసరిగా ఉంటుందని చెప్పా రు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీల్లో ఎవరినైనా ఎంపిక చేయవచ్చని అన్నారు. మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలి? పీసీసీ అధ్యక్ష పదవికి ఎవరికి ఇవ్వాలనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. మహిళలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఫిరాయింపులు తెలంగాణలోనే లేవు కదా?
పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదని సీఎం అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు వలసలు వెళ్లారన్నారు. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలతో ఏకంగా పార్టీనే బీజేపీ విలీనం చేసుకున్నదని చెప్పారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదన్నారు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలని, సంపన్నులకు కాదని స్పష్టంచేశారు. మోదీ పదేళ్ల పాలనలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించలేదుకానీ.. మహిళలు, రైతులకు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం లో విద్యుత్ కొరత లేదని, పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ తప్పులను తాము చేయబోమని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్ రూల్స్‌ను బ్రేక్ చేయదల్చుకోలేదని పేర్కొన్నారు.
ప్రతి నెలా రూ.7వేల కోట్ల అప్పులు చెల్లిస్తున్నాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు నెలకు రూ.7 వేల కోట్ల వరకు అప్పులు చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రం ప్రస్తుతం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, మరో రూ.లక్ష కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం విడిపోయి నప్పుడు నెలకు రూ.6,500 కోట్ల అప్పులు చెల్లించేవారని వివరించారు. గత ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వరకు వడ్డీకి రుణాలు తీసుకున్నారని, ఈ వడ్డీ ఏమాత్రం తగ్గినా ఏటా రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. ఇందుకోసం కేంద్రంతో సంప్రదిం పులు జరుపుతున్నట్టు వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించినట్లు తెలిపారు.
అన్ని శాఖలకు చెందిన రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను ఇప్పటికే కలిశారని, బడ్జెట్‌కు ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ నిధులు పొంతే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలన్నింటిని అసెంబ్లీ ముందుకు తెస్తామన్నారు. చర్చల తర్వాత డ్యాంసేప్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్లుతామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వం మాదిరిగా అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు తావుండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల్లోనే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పారు.
ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ ఆదాయం వృద్ధి
మహిళలకు ఉచితి బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపా రు. 30 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ఇప్పు డు 80 శాతానికి పెరిగిందని, దీనివల్ల ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లా భాలతో నడుస్తోందని అన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారంగా ఉన్న సంక్షేమానికి కూ డా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు, ఇతర పథకాలపై దృష్టి పెడుతామని చెప్పారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత కమిషన్ నియమిస్తామని తెలిపారు. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టు లో పూర్తవుతుందని, కొత్త వారిని నియమించిన తర్వాత కుల గణన చేస్తామని చెప్పారు.
అసెంబ్లీలో చర్చించాకనే మార్పులు.. చేర్పులు..
గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణిలోని లోపాలను సరిచేసే పనిలో ఉన్నామని సీఎం తెలిపారు. ఆ తర్వాత దానికి ఏ పేరు పెట్టినా నడుస్తుందని అన్నారు. కంప్యూటరైజ్ చేయాలా? లేక మాన్యువల్ పద్ధతి పా టించాలా? అనేదానిపై అసెంబ్లీ ముందు పెట్టి న తర్వాతే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ఏ పాలసీ అయినా ముందు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే మార్పు చేర్పులతో తుది విధాన ప్రకటన చేస్తామని తెలిపారు.
బంగారంపై రుణాలకు మాఫీ లేదు
రైతు రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన చేశారు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని, బంగారం కుదువపెట్టిన తెచ్చుకొన్న రుణాలకు మాఫీ ఉండదని ప్రకటించారు. రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, పాస్‌బుక్ ఉంటే సరిపోతుందని చెప్పారు. రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడం కోసమేనని అన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని స్పష్టంచేశారు.
అదానీకి పాతబస్తీ కరెంటు బిల్లుల వసూలు బాధ్యత
పాతబస్తీలో విద్యుత్తు బిల్లుల వసూలు బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగించామని సీఎం తెలిపారు. అదానీ కంపెనీకి అప్పగించటంలో తప్పేముందని ప్రశ్నించారు. అక్కడ అండర్‌గ్రౌండ్ విద్యుత్తు లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని అదానీ కంపెనీని కోరామని వెల్లడించారు. పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూళ్ల విషయంలో నెలకొన్న సంక్లిష్టతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం తెలిపారు. కేంద్ర ప్రభు త్వ ఆస్తులను అదానీకి అప్పగించడా న్ని మాత్రమే రాహుల్‌గాంధీ తప్పుపడుతున్నారని.. అంతేతప్ప అదానీ వ్యాపారం చేయొద్దని ఎన్నడూ అనలేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అదానీ దగ్గర డబ్బులున్నాయి. ఆ డబ్బులు నా దగ్గర (తెలంగాణలో) పెట్టుబడి పెడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.




