ఆర్థిక శాస్త్రంలో టీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కు డాక్టరేట్
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలందిస్తున్న తెలుగు వ్యక్తి టీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కు ఐఐటీ న్యూఢిల్లీ డాక్టరేట్ వరించింది. ఆర్థిక శాస్త్రంలో ఆయన రాసిన పరిశోధన పత్రానికి డాక్టరేట్ అందించింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా ప్రస్తానం ప్రారంభించిన ప్రసాద్.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు.
వరల్డ్ బ్యాంక్‌లో ఏడేళ్లపాటు పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఆర్థిక నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు. ఐఏఎస్ అధికారిగా హర్యానా క్యాడర్‌లో ఫైనాన్స్ సెక్రటరీగా ఆ రాష్ట్ర ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. సెంట్రల్ సర్వీస్‌లో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ ప్రాజెక్టు హెడ్‌గా పనిచేసి పర్యావరణ, నీటివనరుల నిర్వహణలో కీలకభూమిక పోషించారు. ఆయనకు డాక్టరేట్ రావడం పట్ల హైదరబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు.






