15-09-2025 12:25:10 AM
కుటుంబ కలహాలే కారణమా?
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణం!
మంథని, సెప్టెంబర్ 14విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం సెంటినరీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్త భార్యను కడ తేర్చిన ఘటన కలకలం రేపింది. మండలంలోని పన్నూరు గ్రామ పంచాయతీ పరిధి వకీలు పల్లి ప్లాట్స్లో ఆదివారం పట్ట పగలే హత్య జరిగింది. పూసల రమాదేవి (35) అనే మహిళను ఆమె భర్త కృపాకర్ పైశాచికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఆ దంపతుల మధ్య జరుగుతున్న మనస్పర్దల నేపథ్యంలో ఆదివారం ఇద్దరు మళ్లీ ఘర్షణ పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త కృపాకర్ భార్య రమాదేవిపై దాడి చేసి కత్తితో పొడిచాడు . తీవ్ర రక్తస్రావమై రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సంఘటనతో భయకంపితులైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో గోదావరిఖని ఏసిపి మడత రమేష్, రామగిరి ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రమాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హత్య అనంతరం కృపాకర్ పరారయ్యాడు. పోలీసులు హంతకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు . కుటుంబ కలహాల వల్లనే హత్య జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్త్స్ర శ్రీనివాస్ తెలిపారు.