15-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 14 : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒంగోలుకు చెందిన మహాలక్ష్మి(19), రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని బొమ్మలగుడిలో ఉంటున్న ఊపుటల్లి వేణుగోపాల్(28)తో పెద్దల సమక్షంలో గతేడాది ఆగస్టులో వివాహం జరిగింది. వేణుగోపాల్ తాగుడుకు బానిసగా మారి భార్య బంగారు నగలను అమ్ముకున్నాడు.
కొం త బంగారాన్ని ఆమె పుట్టింట్లో దాచగా.. వాటిని తెమ్మని భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది జూలై నెలలో నాగోల్ పోలీస్ స్టేషన్లో భార్య మహాలక్ష్మి ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిద్దరినీ కౌన్సెలింగ్ సెంటర్కి పంపారు. అయితే వారు ఒకే సారి కౌన్సెలింగ్కి వెళ్లారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా వేణుగోపాల్ తీరు మారలేదు.
కాగా, ఆదివారం బంధువుల ఇంటి గృహ ప్రవేశానికి వెళదామని భార్య కోరగా ఆమెతో వేణు గోపాల్ గొడవపడి, కోపంతో బ్లేడు తీసుకొని ఆమె గొంతు కోశాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నిందితుడు వేణుగోపాల్‌ను నాగోల్ పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు.