18-08-2024 12:00:00 AM
మొదటి రెండు స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధానప్రతినిధి, ఆగస్టు 17 (విజయక్రాంతి): గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటులో దేశంలో హైదరాబాద్ దూకుడు కొనసాగుతోంది. 2022 నుంచి 2024 ప్రథమార్ధం వరకు దేశంలో 53 మిలియన్ చదరపు అడుగులు స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. స్పేస్ లీజింగ్‌లో మొదటి రెండు స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు నిలిచాయి. దేశంలో ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్ను, పుణె, ఢిల్లీ, ముంబై నగరాల్లో జీసీసీలు ఈ స్పేస్‌ను లీజుకు తీసుకున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ, హైరింగ్ సొల్యూషన్స్ గ్రూప్ జోయిన్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో తెలిపాయి.
దేశవ్యాప్తంగా లీజుకు తీసుకున్న ఆఫీస్ స్పేస్‌లో జీసీసీల వాటా 37 శాతం ఉందని, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) వాటా 22 శాతానికి పెరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో టెక్నాలజీ కంపెనీలు 15 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకోగా, జీసీసీ ఆఫీస్ లీజులో బెంగళూరు టాప్‌లో ఉండగా, హైదరాబాద్, చెన్ను తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 జనవరి- జూన్ త్రైమాసికంలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జీసీసీల లీజింగ్ కార్యకలాపాలు వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగాయి.
నగరాలవారీగా పరిశీలిస్తే..
2022 నుంచి 2024 జూన్ వరకు దేశంలోని జీసీసీ లీజింగ్ మార్కెట్లో 40 శాతం వాటాతో బెంగళూరు అగ్రభాగాన నిలిచింది. ఈ కాలంలో బెంగళూరులో 21.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. బెంగళూరు తర్వాత 21 శాతం వాటాతో హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ రెండున్నరేళ్లలో 11.13 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. అలాగే చెన్నులో 7.42 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, పుణెలో 6.36 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. ఢిల్లీలో 4.77 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకోగా, ముంబైలో ఇది 2.12 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
కాగా, జీసీసీలు ప్రస్తుతం డిజిటల్ వైపు పరివర్తనం చెందుతున్నందున ముందుచూపుతో ఆలోచించే ఏ అంతర్జాతీయ సంస్థకైనా ఇవి అవసరమైన భాగంగా మారిపోయాయని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. భారతదేశంలో సమృద్ధిగా ఉన్న టెక్, నాన్ టెక్ టాలెంట్ పూల్ ప్రపంచవ్యాప్త పరిష్కారంగా మారుతోందని పేర్కొన్నారు. లైఫ్ సెన్సైస్, ఆటోమొబైల్స్, ఏరో స్పేస్ రంగాలు భారతీయ జీసీసీ ఉనికిని విస్తరించడం వల్ల భవిష్యత్తు మరింత వైవిధ్యంగా ఉంటుందని, జీసీసీల అభివృద్ధికి వ్యూహాత్మక రోడ్ మ్యాప్‌తో నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందని అన్షుమన్ తెలిపారు.