calender_icon.png 15 July, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ ఎస్టేట్‌లో పెరుగుతున్న ఉపాధి

18-08-2024 12:00:00 AM

కెరీర్‌గా ఎంచుకుంటున్న నిరుద్యోగులు

హైదరాబాద్, సిటలీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 17 (విజయక్రాంతి): దేశంలో నగరీకరణ క్రమంగా విస్తరిస్తోంది. నగరాలు, పట్టణాలను దాటుకుని పల్లెల వరకు రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రియల్ రంగం పరుగులు పెడుతోంది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుడంటంతో నిర్మాణ రంగం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు సాగుతోంది. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.

ఆర్థిక ఆరోగ్యానికి సూచికగా పేర్కొనే స్థిరాస్తి పరిశ్రమ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ, సొంత ఇంటి ఆకాంక్ష కూడా పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుని విజయం సాధించేందుకు నిరుద్యోగ యువత ఉవ్విళ్లురుతోంది. సాంకేతికత అభివృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్ పరిశ్రమ గణనీయమైన మార్పుకు లోనైంది. వర్చువల్ రియల్టీ టూర్లు, ఆన్‌లైన్ ప్రాపర్టీ లిస్టింగ్‌లు, డిజిటల్ చెల్లింపు ఎంపికలు ప్రమాణంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో వీటిపై మంచి అవగాహన, పట్టు కలిగి ఉన్నవారికి చక్కని కెరీర్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ కెరీర్ నిరుద్యోగులకు చాలా అవకాశాలు కల్పిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాపర్టీ బ్రోకరేజ్, అమ్మకాల నుంచి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, రియల్ ఎస్టేట్ చట్టం వరకు రియల్ ఎస్టేట్‌ను ప్రొఫెషన్‌గా ఎంపిక చేసుకునేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారని రియల్టర్లు పేర్కొంటున్నారు. ఈ రంగం విస్తరిస్తున్న కొద్దీ నైపుణ్యం కలిగిన నిపుణులకు కూడా డిమాండ్ పెరుగుతోందని రియల్ నిపుణులు వెల్లడిస్తున్నారు.