calender_icon.png 16 July, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్

16-07-2025 12:00:00 AM

  1. దేశంలో అత్యధికంగా వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి ఇక్కడే 
  2. రాబోయే రోజుల్లో డేటా సిటీగా రాజధాని నగరం
  3. జీనోమ్ వ్యాలీలో ఐకార్ కొత్త యూనిట్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

మేడ్చల్, జూలై 15 (విజయక్రాంతి)/శామీర్ పేట్:  ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్‌కు మంత్రులు డీ శ్రీధర్‌బాబు, వివేక్‌వెంకట స్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా 33శాతం వ్యాక్సిన్లు, 43 శాతం బల్క్ డ్రగ్స్ ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు.

కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్స్ ఎగుమతి చేసిన ఘనత జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తలదేనన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్తాయని, తమ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3.28 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగామన్నారు.

రాబోయే రోజుల్లో డేటా సిటీగా హైదరాబాద్ మారనుందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి అధునాతన విధానాలను తీసుకురావడానికి ప్రయత్ని స్తున్నామన్నారు. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందుకు జీనోమ్ వ్యాలీ పారిశ్రామి కవేత్తల సహకారం ఉండాలని కోరారు. 

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు కృషి: మంత్రి శ్రీధర్‌బాబు 

తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. లక్ష్యసాధనలో ఐకార్  రూపంలో అడుగు ముందుకు పడిందని, దీనివల్ల కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

సీబీఆర్ ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్ల జాబితాలో బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జి, టోక్యో తదితర నగరాల సరసన హైదరాబాద్ చేరిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి తొలిసారి హైదరాబాద్ నగరం చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి ఉతమిచ్చేలా అవసరమైన ఏకో సిస్టమ్‌ను నిర్మించడంలో తెలంగాణ ప్రపంచానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్-, నాగపూర్, హైదరాబాద్-, బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజెస్ ను అభివృద్ధి చేయనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.