08-07-2025 12:00:00 AM
కారులో మంటలు చెలరేగి నలుగురి మృతి
సంగారెడ్డి, జూలై 7 (విజయక్రాంతి): అమెరికాలో నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అగ్నికి ఆహుతైంది. మెదక్ జిల్లా మ నోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన రవి తన కూతురు తేజస్విని హైదరాబాద్‌కు చెందిన వెంకట్‌కు ఇచ్చి వివాహం చేశాడు. తేజస్విని, వెంకట్ అమెరికాలో గత ఎనిమిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పిల్లలతో కలిసి వెకేషన్ కోసం అట్లాంటలో బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. వారం రోజుల పాటు అట్లాంటలో ఉండి డల్లాస్ వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. గ్రీన్‌కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి తేజస్విని, వెంకట్‌తో పాటు ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్‌కు పంపారు.
డీఎన్‌ఏ పరీక్షకు శాంపిల్స్ తీసుకొని మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కాగా తేజస్విని తండ్రి రవి ప్రస్తుతం కొంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటన విషయం తెలిసి కూచారం గ్రామంలో విషాద ఛాయలునెలకొన్నాయి.