08-07-2025 12:00:00 AM
- ఇద్దరి మెడలపై తీవ్ర గాయాలు
- యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం
- సంగారెడ్డి జిల్లాలో ఘటన
పటాన్‌చెరు, జూలై 7: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్‌లో సోమవారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. మెడపై తీవ్ర గాయాలతో యువతి మృతిచెందగా.. యవకుడి పరిస్థితి విషమంగా ఉన్నది. అసలు ఆత్మహత్యాయత్నా నికి పాల్పడ్డారా? కుటుంబ సభ్యులెవరైనా దాడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రామచంద్రాపురం మండలం బండ్లగూడలోని బాలాజీ నగర్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్న రమ్య(22) డిగ్రీ చదువుతున్నది. గత మూడు సంవత్సరాలు గా ఆకుల ప్రవీన్‌కుమార్, రమ్య ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం రమ్య ఇంట్లో తెలియడంతో రమ్య చదువు పూర్తి అయిన తర్వాత పెళ్లి చేస్తామని వారి కుటుంబ పెద్దలు తెలిపినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం రమ్య ఇంటికి ప్రవీన్‌కుమార్ వెళ్లి కొద్దిసేపు మాట్లాడినట్టు తెలిసింది.
ఆ తర్వా త ఏం జరిగిందో తెలియదుగానీ రమ్య మెడపై గాయాలతో తీవ్ర రక్తస్రావం జరిగి ఇంట్లోనే మృతి చెందింది. ప్రవీన్‌కుమార్ మెడకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రమ్య కుటుంబీకులు ప్రవీన్‌కుమార్‌ను రామచంద్రాపురంలోని ఆసుపత్రికి తరలించారు. రమ్య రక్తపు మడుగులోనే విగత జీవిగా పడి ఉంది.
హత్యా?.. ఆత్మహత్యా?
ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా హత్యాయత్నానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. ఇద్దరు ఇంట్లోనే మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగిందనేది అంతు చిక్కడం లేదు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసిందా.. లేక ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉంది.
ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే పెళ్లి విషయంలో ఏదైనా గొడవలు జరిగాయా, ఎవరైనా ప్రమాదం తలపెట్టారా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే విచారణ జరుపుతున్నామని మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. ప్రవీన్ కుమార్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నదని, కోలుకున్న తర్వాతే అసలు విషయం బయటకు వస్తుందని ఏసీపీ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.