11-09-2025 01:07:08 AM
-సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్ జస్టిస్ సప్రే
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణ, పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు అత్యంత ప్రశంసనీయంగా ఉన్నాయని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే కొనియాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెఎంసీ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
బుధవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జీహెఎంసీ పనితీరుపై ఆయన సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశానికి రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ డా. జితేందర్, పురపాలక కార్యదర్శి ఇలంబరితి, జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌తో పాటు పోలీసు, రెవెన్యూ, హెఎండీఏ, రవాణా, ఆర్‌అండ్‌బీ, ట్రాఫిక్ విభాగా ల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సం దర్భంగా రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయం తో, పటిష్టమైన చర్యలు చేపట్టాలని జస్టిస్ సప్రే దిశానిర్దేశం చేశారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, నగరంలో చేపట్టిన రోడ్డు భద్రతా చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి సమ గ్రంగా వివరించారు. నగరవ్యాప్తంగా 1,687.76 కి.మీ రోడ్లపై లేన్ మార్కింగ్, 3,949 జీబ్రా క్రాసింగ్‌లు, 3,453 స్టాప్ లైన్లు, 3,335 సైన్‌బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
ప్రధాన రహదారులపై ప్రతి ఏటా లేన్ మార్కింగ్ పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు నిలయాలుగా మారిన 92 బ్లాక్ స్పాట్లను గుర్తించగా, వాటిలో ఇప్పటికే 75 ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు శాస్త్రీయ చర్యలు పూర్తి చేశామన్నారు. కేవలం జూలై 2025 నుంచి ఇప్పటివరకు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 1,442 గుంతలను పూడ్చివేయడం, 574 క్యాపిట్ మరమ్మతులు, 328 క్యాపిట్ కవర్ల మార్పిడి వంటి పనులు పూర్తిచేశామన్నారు.