calender_icon.png 20 May, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ మూకీ సినిమాను చరిత్ర రచనలో విస్మరించారు!

20-05-2025 12:36:12 AM

తెలుగు సినిమా చరిత్ర రచనలో ‘హైదరాబాద్ మూకీ సినిమా ప్రస్థానం విస్మరణకు గురైందని, తెలంగాణ సిని మాను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించాలని వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ  సంస్కృతి, చరిత్ర, అస్తిత్వాన్ని ప్రతిబింబించే సినిమాలకు పన్ను రాయితీ, సబ్సిడీ కల్పించాలని కోరారు.

తెలంగాణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ సినిమా రంగం  అవరోధాలు’ అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో చర్చాగోష్ఠి జరిగింది. రచయిత పసునూరి రవీందర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి పలువురు సినీదర్శక, నిర్మాతలు, విమర్శకులు, రచయితలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సినీ విమర్శకుడు హెచ్ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. “తెలుగు సినిమా చరిత్ర రచనలో ‘హైదరాబాద్ మూకీ సినిమా ప్రస్థానం’ విస్మరణకు గురైంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, తద్వారా తెలంగాణ సినిమాల నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలి” అన్నారు.

ఆంధ్రజ్యోతి దినపత్రిక సండే మ్యాగజైన్ ఎడిటర్, సినీ విమర్శకుడు చల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పూణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తరహాలో ఇక్కడా ఓ విద్యాసంస్థను నెలకొల్పాలి. తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని, అస్తిత్వాన్ని సినిమాకు అనుసంధానం చేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. మాజీ సీఎం కేసీఆర్ కోరిక మేరకు నేను తెలంగాణ సినిమా పాలసీ విధి విధానాలను సూచిస్తూ ఒక డ్రాఫ్ట్ ను రూపొందించిచ్చాను.

దాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు సూచించడం ముదావహం’ అని తెలిపారు. దర్శకుడు అక్షరకుమార్ మాట్లాడుతూ.. ‘థియేటర్ల కేటాయింపు, రాయితీలు, అనుమతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేయడమే కాకుండా ఏటా ఉత్తమ తెలంగాణ సినిమాకు రూ.కోటి నగదు పురస్కారం ప్రకటించాలి’ అన్నారు. 

సినిమా పరిరక్షణ కమిటీ ఏర్పాటు 

సయ్యద్ రఫీ అధ్యక్షతన తెలంగాణ సినిమా పరిరక్షణ కమిటీని డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి ప్రకటించారు. దర్శకుడు ప్రేమ్‌రాజ్‌తోపాటు సయ్యద్ రఫీ, ప్రవీణ్ చందర్, హెచ్ రమేశ్‌బాబు, పాశం యాదగిరి, మోహన్ బైరాగి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబా, దాసోజు లలిత, ఖాజా మన్సూర్, ప్రసేన్, సారంగి అవార్డుల నిర్వాహకుడు ఖాజా ఆఫ్రిదీ తదితరులు ఇందులో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరికొన్ని అంశాలపై తీర్మానం చేశారు.