21-08-2025 07:48:25 PM
గచ్చిబౌలి (విజయక్రాంతి): మాదాపూర్ జూబ్లీ ఎంక్లేవ్(Jubilee Enclave)లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు గురువారం కూల్చివేత చర్యలు చేపట్టారు. కాలనీ పెద్దల ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించిన అధికారులు, రెవెన్యూ విభాగంతో కలిసి సమీక్ష జరిపి దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలం జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసినట్టు గుర్తించారు. అయితే ఆ స్థలాన్ని ఆక్రమించినట్లు నిర్ధారించడంతో వెంటనే బుల్డోజర్ల సహాయంతో నిర్మాణాలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో కూడా ఆక్రమణలు బయటపడ్డాయి. సుమారు 300 గజాల స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి షెడ్ నిర్మించారని గుర్తించిన అధికారులు దానిని కూల్చివేసి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.
మొత్తం 22 ఎకరాల లేఔట్‌లో నాలుగు పార్కులు ఉండగా, అందులో రెండు పార్కులు, ఒక రహదారి, ప్రభుత్వ స్థలం కలిపి దాదాపు 16 వేల గజాలు అక్రమాలకు గురైనట్టు తేలింది. వీటి విలువ సుమారు 400 కోట్ల రూపాయలుగా అంచనా. అక్రమాలను తొలగించిన తరువాత పార్కు స్థలంలో హైడ్రా అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి చుట్టూ ఫెన్సింగ్ చేశారు. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. పార్కులను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు కాలనీ వాసులు హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.