9 April, 2026 | 2:45 AM

ఐలాపూర్ భూముల్లో హైడ్రా అడుగుపెట్టొద్దు

09-04-2026 12:43 AM

కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్

న్యాయవాది ముఖీమ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

అమీన్‌పూర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): బడుగు బలహీనవర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, న్యాయవాది ముఖీమ్ తెలిపారు. ఐలాపూర్‌లో బుధవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐలాపూర్ భూముల్లో హైడ్రా అధికారులు తమ వాహనాలతో నిత్యం తిరుగుతూ గ్రామస్తులను, ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

కోర్టు పరిధిలో ఉన్న ఐలపూర్ భూ ములపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టిన అమీన్‌పూర్  రెవెన్యూ అధికారుల చర్యలను ఖండి స్తున్నామని తెలిపారు. సంవత్సరం క్రితం ఐలాపూర్ రాజగోపాల్‌నగర్ పేరుతో నూతనంగా ఏర్పడిన సొసైటీ హైడ్రా అధికారి రంగనాథ్‌తో కలిసి ఐలాపూర్ భూములలో భారీ భూ కుంభకోణా నికి తెరలేపినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని, త్వరలోనే ఆ గుట్టును రట్టు చేస్తామని న్యాయవాది ముఖీమ్ అన్నారు.

ఐలాపూర్ భూముల వ్యవహారంలో రిట్ అప్పీల్ పెండింగ్ ఉందని, రిట్ అప్పీల్ ద్వారా హైడ్రా అధికారులు ఐలపూర్ భూముల్లోకి ప్రవేశించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ జోక్యం తగదని, హైడ్రా తన నిబంధనలకు లోబడి పనిచేయాలని సూ చించారు. గ్రామస్తులు ఎవరు కూడా హైడ్రాకు భయపడవద్దని, న్యాయస్థానాలు మనకు రక్షణ కవచంలా ఉన్నాయని భరో సా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఐలాపూర్ భూముల రైతుల పక్షాన గళం వినిపించేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఐలాపూర్ భూముల వ్యవహారంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు నిబంధనలకు అనుగుణంగా సంయమనంతో పనిచేసే విధంగా ఆయా శాఖలను కట్టడి చేయాలని, గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేయకుండా కేసులు తుదితీర్పు వచ్చే వరకు రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.

కోర్టు పరిధిలో లేని, వివాదాస్పదం కాని భూముల వ్యవహారంలోకి హైడ్రా, రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకోవద్దని ఎమ్మార్పీఎస్ తరఫున సూచించారు. రైతులకు ఉండే చట్టబద్ధమైన హక్కులను హైడ్రా కాలరాయొద్దని, ఆ భూముల్లో వ్యవసాయం, నిర్మాణాలు చేసుకునే హక్కులు వారికి ఉంటాయని ప్రభుత్వాన్ని ఉద్దేశించి రైతుల తరఫున హితవు పలికారు. ఈ  సమావేశంలో ఐలాపూర్ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.