సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయాలకు నోటీసులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయాలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. తిరుపతి రెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు, ఐఏఎస్, ఆర్ఆర్ఎస్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. దుర్గం చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని నిర్మాణాలకు నోటీసులు అందాయి. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లోని నిర్మాణాలకు నీటిపారుదల, రెవెన్యూ శాఖ నోటీసులిచ్చింది.
30 రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దుర్గం చెరువు ప్రాంతంలోని 204 భవనాలకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీలోని నిర్మాణాలకు, కావూరి హిల్స్, అమర్ సొసైటీలోని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ లోని నిర్మాణాలకు గతంలోనే అధికారులు మార్క్ చేశారు. నాన్ డెవలప్ మెంట్ జోన్ గా దుర్గం చెరువును గుర్తించారు. సుమారు 100 ఎకరాల దుర్గం చెరువు 84 ఎకరాలకు తగ్గినట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారుల నోటీసులపై నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులపై కోర్టును ఆశ్రయించేందుకు నిర్మాణదారులు సిద్ధమవుతున్నారు.






