07-05-2025 12:00:00 AM
సమంత తన సొంత ప్రొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలిచిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో సమంత మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలివీ..
-నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నా. నిర్మాతకు ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమవుతోంది. నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలేవీ నాకు అర్థం కాలేదు. ఒక్కరోజు ఒక్క సీన్ అనుకున్నట్టు రాకపోతే ఎంత నష్టం వస్తుందో.. డబ్బు ఎంత వృథా అవుతుందో.. ఎంత మంది టైమ్ వేస్ట్ అవుతుందో ఇప్పుడు తెలిసివచ్చింది. వారం రోజులుగా నేను నిద్రలేని రాత్రులే గడుపుతున్నా. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, మిక్సింగ్ టీమ్, ఎడిటింగ్.. ఇలా టీమ్ అందరూ నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. వాళ్లపై మరింత గౌరవం పెరిగింది.
-నటిగా నేను ఎంతో చూశా.. ఎంతో అభిమానం లభించింది. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక ఉంటూ వచ్చింది. నేను తీసుకున్న ఆ బ్రేక్ టైమ్‌లో నిర్మాతగా మారాలన్న ఆలోచన వచ్చింది. ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను ప్రారంభించి, 8 నెలల్లోనే పూర్తిచేశాం.
-‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం.. ఈ చిత్రంలో ఎక్కువగా సీరియల్ గురించి ఉండటమే. ఆ సీరియల్‌లో శుభం కార్డు ఎప్పుడు పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు. నా ప్రొడక్షన్ కంపెనీకి ట్రా లా లా అని పెట్టడానికి కూడా కారణం ఉంది. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ఆ అని పెట్టాం.
-గౌతమ్ మీనన్ తలుచుకుంటే ఆ టైమ్‌లో ఏ టాప్ హీరోయిన్‌నైనా తీసుకోవచ్చు. కానీ నాలాంటి కొత్తవారికి అవకాశమిచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్తవారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఉన్నా. ఎన్నో కలలు కంటూ ఇండస్ట్రీకి వస్తారు. శ్రియా, శ్రావణి, షాలినీ ఎంతో కష్టపడ్డారు. వీళ్లందరినీ చూస్తే నా పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి.
-‘శుభం’ చిత్రంలోని క్యామియో పాత్రను నేను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా మొదటిసారిగా నేను ఎవరి దగ్గరకు వెళ్లి ఫేవర్ అడగాలనుకోలేదు. అందుకే ఆ పాత్రను నేనే పోషించా.
-ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని చేస్తున్నా. జూన్ నుంచి మళ్లీ షూట్‌కు వెళ్తున్నాం. అట్లీతో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి.
-‘శుభం’ జనరల్ హారర్, కామెడీ అనేలా ఉండదు. ఇందులో సోషల్ సెటైర్ ఉంటుంది. మెస్సేజ్ ఉంటుందా? లేదా? అన్నది ప్రేక్షకులే తెలుసుకోవాలి. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఈ మూవీ ప్రతీ ఆడియెన్స్ మీద ప్రభావం చూపించాలని కోరుకున్నా.
-నాకు నేనే ఓ పెద్ద విమర్శకులురాలిని. ఏ సినిమాలో ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు జరగకూడదనుకున్నాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా సినిమాను కట్ చేశాం. ఎప్పుడైనా నా మనసుకు నచ్చిందే చేశాను. నేనొక స్మార్ట్ ప్రొడ్యూసర్‌ను కాకపోవచ్చు.. నాకు బిజినెస్ గురించి అంతగా తెలియకపోవచ్చు.. కానీ, అందరి అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం ఉంటుందనైతే చెప్పగలను.
-ఓ అభిమాని నాకు గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడంలేదు. నాపై అతని ప్రేమను చూపించే తీరు అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, పూజలు చేసే పద్ధతిని మాత్రం ఎంకరేజ్ చేయలేను.