07-05-2025 12:00:00 AM
శ్రీవిష్ణు హీరోగా కార్తీక్‌రాజు దర్శకత్వం లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం ‘సింగిల్’. ఇం దులో కేతికశర్మ, ఇవానా కథానాయికలుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. గీతాఆర్ట్స్, కళ్యాఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానున్న సందర్భంగా హీరోయిన్ కేతికశర్మ బుధవారం విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. “రాబిన్‌హుడ్’లో -అదిదా సర్‌ప్రైజు పాట వైరల్ కావడం చాలా ఆనందాన్నిచ్చింది. ‘సింగిల్’లో అలాంటి డాన్సింగ్ నెంబర్ ఏమీలేదు. -గీతాఆర్ట్స్‌థలో పనిచేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తుంటారంటే కచ్చితంగా ఆ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్‌తో వస్తున్న వెరీగుడ్ ఎంటర్‌టైనర్ ఇది.
ఇందులో నేను పూర్వ అనే పాత్రలో కనిపిస్తా. తను చాలా స్వతంత్రంగా, ప్రాక్టికల్‌గా ఉండే అమ్మాయి. కథలోని భావోద్వేగాలు నా పాత్ర చుట్టే ఉంటాయి. లవ్‌స్టోరీ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. కామెడీ చేయడం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. శ్రీవిష్ణు టైమింగ్ మ్యాచ్ చేయడం వెరీ డిఫికల్ట్. ఆయన చాలా సింపుల్, హంబుల్‌గా ఉంటారు. కామెడీ టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. స్పాట్‌లోనే డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసేస్తుంటారు. పర్ఫార్మెన్స్ చాలా స్పాంటేనియస్‌గా ఉంటుంది.
ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప అనుభూతినిచ్చింది. ఇవానాకూ, నాకూ ఆన్‌స్క్రీన్‌లో ఒకట్రెండు సన్నివేశాలే ఉంటాయి. కానీ, ఆఫ్‌స్క్రీన్‌లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పటికైతే నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా ఉన్నా. గెలుపోటములో మన చేతిలో ఉండవు. ఫలితం గురించి నేనెప్పుడూ ఆలోచించను. కెరీర్‌ను సెలబ్రేట్ చేసుకోవాలనే చూస్తుంటా. ఒక నటిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తా.
ఇదే -గీతాఆర్ట్స్ బ్యానర్‌లో రష్మిక మందన్న ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా వస్తోంది. అందులో రష్మిక క్యారెక్టర్ వెరీ బ్యూటిఫుల్. అలాంటి పాత్ర చేయాలనేది నా కల. అలాగే సాయిపల్లవి, కీర్తి సురేశ్ చేస్తున్నట్లు.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేయాలనుంది. ఇంకా కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే.. -హిందీలో ఒక సినిమా చేస్తున్నా. మరో తమిళ్, తెలుగు బైలింగ్వల్ చేస్తున్నా. ఇంకొన్ని ప్రాజెక్టులూ ఉన్నాయి. అవి మేకర్స్ రివిల్ చేస్తారు” అని చెప్పింది.