calender_icon.png 23 February, 2026 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మినోడిని నట్టేట ముంచి

23-02-2026 12:11:27 AM

  1. స్నేహం ముసుగులో హత్య
  2. జీఎస్టీ డబ్బులు అడిగినందుకు ప్రాణాలు తీసిన స్నేహితుడు
  3. సంచలనంగా మారిన కేసును చేదించిన పోలీసులు

కూసుమంచి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కష్టాల్లో ఉన్నాడని సహాయం చేసిన ఓ స్నేహితుడ్ని నమ్మినందుకు.. నట్టేటా ముంచి హత్య చేసి సంఘటన ఇటీవల కూసుమంచిలో చోటుచేసుకుంది. మిత్రుడు కదా అని సహాయం చేస్తే తనతో పాటు ప్రభుత్వాన్నే తప్పదోవ పట్టించి, తప్పును కప్పిబుచ్చేందుకు ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిన ఓ మిత్రుడి కథ కంచేకి చేరింది. కత్తులతో అతి దారుణంగా హత్య చేసి కారు ప్రమాదంగా చిత్రీకరించిన స్నేహితుడి ఘనకార్యాన్ని ఖాకీలు బట్టబయలు చేసి కటకటాల్లోకి పంపించేశారు.

ఇటీవల పాలేరు జలాశయంలో కారు ప్రమాదంలో యూట్యూబర్ గొల్ల శ్రీనివాస్ అలియాస్ బొగ్గుల శ్రీనివాస్ చనిపోగా, అట్టి ఘటన వివరాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, అల్లూరు గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు  @ బొగ్గుల శ్రీనివాస్(48) యూట్యూబర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తార్నాకలో నివాసం ఉంటున్నాడు.

బొగ్గుల శ్రీనివాస్,  మేకల వేణుమాధవ్ రెడ్డి సిల్వర్ జూబ్లీ కాలేజీ లో చదువుకోగా, కాలేజీ పూర్వ విద్యార్దుల సమ్మేళనానికి వెళ్ళిన క్రమములో ఒకరికొకరు పరిచమయ్యారు. బొగ్గుల శ్రీనివాస్ కు బొగ్గుల బీబీక్యూ పేరుతో జీఎస్టీ లైసెన్స్ ఉందని,  మేకల వేణుమాధవ్ రెడ్డి సొంతంగా మేకా ప్రాజెకట్స్ అనే కంపనీ పెట్టి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారని  ఏసీపీ తెలిపారు. మృతుడు శ్రీనివాస్ ఫేక్ ఇన్ వాయిస్ అండ్ సేల్స్ ఫైల్ చేసి మంచి లాభాలు సంపాదించవచ్చని మేకల వేణుమాధవ్ రెడ్డి మాయమాటలు చెప్పి జీఎస్టీ లైసెన్స్ ను ఉపయోగించుకున్నాడు.

అందుకు శ్రీనివాస్ కు 50 శాతం ప్రాఫిట్ ఇస్తానని చెప్పి, ఆ జీఎస్టీని వాడుకున్నాడు. 2022-25 వరకు జీఎస్టీ ఫైలింగ్స్ తో దాదాపు రూ. 90 లక్షలు సంపాధించిన వేణుమాధవ్, అందులో  శ్రీనివాస్ వాటా రూ. 45 లక్షలు కాగా, మొదటి దఫాగా రూ. 15 లక్షల శ్రీనివాస్ కు ఇచ్చినట్లు తెలిపారు. మిగతా 30 లక్షలు తనకు ఆర్దిక ఇబ్బందులు కారణంతో ఆలస్యమైంది.  ఇదే క్రమములో జీఎస్టీ ప్రాడ్ కు సంబంధించి  డిపార్ట్మెంట్ నుండి నోటిస్‌లు రావడం,  శ్రీనివాస్ కు చెందిన  లైసెన్సు ను రద్దు చేయడంతో శ్రీనివాస్ తనకు చెల్లించాల్సిన ప్రాఫిట్  రూ.30 లక్షలు, లైసెన్సు ను ఆక్టివ్ చేయాలని కోరాడు.

దీంతో వారి మధ్య గొడవలు రావడంతో హత్య చేయాలని భావించిన వేణు మాధవ్ రెడ్డి,  భద్రాద్రికొత్తగూడెం జిల్లా, ఆశ్వరరావుపేటకు చెందిన పోకల కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, ఎండీ అజ్మత్ అలీఖాన్ లతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు వారు ఒప్పుకున్నారని ఏసీపీ మీడియాకు తెలిపారు. ఈ హత్య చేయడానికి హఫీజ్, అలీఖాన్ లకు రూ.5లక్షల సుఫారీ ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు.

ఈనెల 13న రాత్రి శ్రీనివాస్ కు పోన్ చేసి పెండింగ్ డబ్బులు ఇస్తానని నమ్మబలికి విజయవాడకు వెళ్దామని చెప్పి కారులో ఎక్కించుకుని, మరసటి రోజు తెల్లవారుజామున నకిరేకల్ నుండి జనగాం వైపు వెళ్లే దారిలో జనసంచారం లేని ప్రదేశంకు తీసుకెళ్లి కత్తులతో, ఐరన్ రాడ్లతో మృతుని తలపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. హత్య అనంతరం ఇట్టి ఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు మృతదేహంతో పాటు వాహనాన్ని పాలేరు రిజర్వాయర్లోకి కారును నెట్టేసి చిత్రీకరించారని తెలిపారు.

మొదటిగా ప్రమాదంగా భావించిన అనంతరం మృతదేహానికి గాయాలు ఉండటంతో అనుమానస్పదంగా చనిపోయినట్లు కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేశారని, ఆ తరువాత నాలుగు టీమ్స్ తో దర్యాప్తు చేపట్టామ న్నారు.కేసు నమోదైన వెంటేనే నేను  చాకచక్యంగా వ్యవహరించి కూసుమంచి సీఐ టి.సంజీవ్ ఆధ్వర్యంలో కూసుమంచి ఎస్‌ఐ జె.నాగరాజు, నేలకొండపల్లి ఎస్‌ఐ పి.సంతో ష్, తిరుమలాయపాలెం ఎస్‌ఐ టి. జగదీష్, శిక్షణ ఎస్‌ఐ దివ్య లను నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు,

ఇతర సాక్ష్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. హత్యలో ఉపయోగించిన ఆయుధాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నామని, నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో సహకారం అందించిన నేలకొండపల్లి, తిరుమలయపాలెం, కూసుమంచి ఎస్‌ఐలకు, సాంకేతిక సహకారం అందించిన శ్రీకాంత్, సతీశ్, వినయ్, ఉదయ్, సిబ్బంది పూర్ణచందర్‌రావు, శ్రీశైలం, శ్రీలత, సయ్యద్, శోభన్, సీతారాములు, హోమ్ గార్డ్ రాంబా బులను ఏసీపీ అభినందించారు.