ఎవరెస్ట్‌ను అధిరోహిస్తా!
సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు మహబూబాబాద్ జిల్లా భూక్యా తండాకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్. యశ్వంత్ ఇప్పటివరకు దేశ విదేశాల్లోని ప్రఖ్యాతి గాంచిన 15 పర్వత శిఖరాలను అధిరోహించి తన ప్రతిభను చాటుకున్నాడు. పేదరికాన్ని అడ్డంకిగా కాకుండా సవాల్‌గా స్వీకరించి ప్రపంచ పర్వతారోహణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎవరెస్ట్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
15 ఎత్తున శిఖరాల అధిరోహణ
యశ్వంత్ చిన్ననాటి నుంచే సాహస క్రీడలపై ఆసక్తి పెంచుకుని పర్వతారోహణ వైపు అడుగులు వేశాడు. కఠినమైన శిక్షణ తీసుకుంటూ అనేక శిఖరాలను విజయవంతంగా అధిరోహించాడు. 2021లో ఆఫ్రికాలోని కిలిమంజారో (5,895 మీటర్లు), 2022లో యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ (5,642 మీటర్లు), 2023లో నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5,364 మీటర్లు), 2024లో లడఖ్ ప్రాంతంలోని కాంగ్ యత్సే-2 (6,250 మీటర్లు) వంటి శిఖరాలను అధిరోహించాడు. ఇవే కాకుండా స్టోక్ కాంగ్రి, ఫ్రెండ్షిప్ పీక్, బ్రహ్మతాల్ ట్రెక్, కేదార్కంఠ వంటి పర్వతాలను కూడా అధిరోహించాడు.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘హర్ శిఖర్ పై తిరంగా’ సంకల్పంతో ముందుకు సాగుతూ, ఈ విశిష్ట ఘనత సాధించిన తొలి వ్యక్తిగత పర్వతారోహకుడిగా నిలవాలని తన యాత్రను సాగిస్తున్నాడు. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను విజయవంతంగా అధిరోహించాడు.
తదుపరి లక్ష్యం ఎవరెస్ట్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నదే యశ్వంత్ ప్రధాన లక్ష్యం. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతున్నారు. త్వరలో ఎవరెస్ట్ యాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యశ్వంత్ కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించడం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ సహాయం, ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధిస్తానని యశ్వంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. యశ్వంత్ విజయాలతో మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.
యువ పర్వతారోహకుడు యశ్వంత్ ప్రతిభను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభినందనలు, ప్రశంసలు అందుకున్నాడు. ‘కష్టపడితే అసాధ్యం ఏదీ లేదు’ అనే నమ్మకంతో ముందుకు సాగుతున్న యశ్వంత్ విజయగాధ యువతకు మార్గదర్శకంగా నిలుస్తోంది.
ఇప్పటివరకు యశ్వంత్ అధిరోహించిన 15 శిఖరాల్లో భారత్‌లోని పలు రాష్ట్రాలోని ప్రధానమైన శిఖరాలు ఇవి..
అరుణాచల్ ప్రదేశ్ మౌంట్ గోరిచెన్ (6,858 మీటర్లు)
మిజోరం ఫావాంగ్పుయి (2,157 మీటర్లు)
అసోం మౌంట్ తుమ్జాంగ్ (1,860 మీటర్లు)
రాజస్థాన్ గురు శిఖర్ (1,722 మీటర్లు)
ఒడిశా డియోమాలి (1,672 మీటర్లు)
మణిపూర్ మౌంట్ ఐసో (2,994 మీటర్లు)
త్రిపుర బెట్లింగ్చిప్ (939 మీటర్లు)
మేఘాలయ షిల్లాంగ్ పీక్ (1,966 మీటర్లు)
ఆంధ్రప్రదేశ్ అర్మా కొండ (1,680 మీటర్లు)
హిమాచల్ ప్రదేశ్ రియో పుర్గ్యిల్ (6,816 మీటర్లు)




