ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా..
తాడ్వాయి, జూన్, 29(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామంలో ఆయన రూ.20 కోట్లతో నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలా సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్న నియోజకవర్గాన్ని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని రోడ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చి రోడ్లను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డు ఎర్ర పహాడ్ గ్రామం నుంచి వయా దేమికలాన్,కన్కల్ గ్రామాలనుంచి గాంధారి రోడ్డు లింగంపల్లి స్టేజి వరకు రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
తాను గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోని రోడ్లను పరిశీలిస్తున్నాని ఇక్కడ రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. అందుకోసమే తాను ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గాంధారిలో రూ.3.75 కోట్లతో గ్రంథాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. దేమికలాన్ గ్రామానికి రూ.40 లక్షలు సీఎం నిధులు లబ్ధిదారులకు మంజూరు చేయించి అందించినట్లు ఆయన తెలిపారు.ఒక్క దేమికలాన్ గ్రామంలోనే 30 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.
మహిళా భవనానికి రూ. 10 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఎల్లప్పుడు ప్రజాసేవలో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికే పాటు పడుతున్నానని తెలిపారు. తనను ఆదరించిన ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటికం భైరవి రాజిరెడ్డి, కన్కల్ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ దుడిగే గంగయ్య, తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి సంజీవులు, నాయకులు మద్ది మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యాంరావు,గైని శివాజీ, శౌకత్ అలీ, నల్లవెల్లి సాయి రెడ్డి,గడ్డం ప్రతాప్ రెడ్డి, సంకు పోచయ్య, మోహన్ రెడ్డి, అఖిల్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






