నాదర్గుల్ రైతుల సమస్యలపై ఉద్యమిస్తా
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ
హైదరాబాద్, మే 5(విజయక్రాంతి): మీ సమస్యలపై ఉద్యమం చేపడతానని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న నాదర్గుల్ రైతులకు హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ గ్రామానికి చెందిన కాసుబాగ్ రైతులు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని, ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్‌ని మర్యాదపూర్వకంగా కలసి తమ సమస్యలను వినిపించారు.
నాదర్గుల్ సర్వే 613/119లో ఉన్న సుమారు 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత 60 ఏళ్లుగా దాదాపు 150 మంది రైతు కుటుంబాలు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాయి. అయితే, ఇటీవల కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ సహకారంతో ఈ భూములను బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులపై దాడులు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం వంటి చర్యల ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలసి సమస్యలను విన్నవించారు.
రైతుల సమస్యలను విన్న మల్లన్న, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఆ ఉద్యమంలో నాదర్గుల్ రైతుల సమస్యలను కూడా ప్రాధాన్యంగా చేర్చి న్యాయం సాధించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రైతు ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలపై వివరమైన రిప్రజెంటేషన్ సమర్పించారు.






