ఐసీఐసీఐ బ్యాంక్ నికరలాభం రూ.10,707 కోట్లు

28-04-2024 02:05:44 AM

17 శాతం పెరుగుదల

నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధి

షేరుకు రూ.10 డివిడెండుకు సిఫార్సు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో రెండో పెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ అంచనాలకు అనుగుణమైన క్యూ4 ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాది క్యూ4తో పోలిస్తే 17 శాతం వృద్ధిచెంది రూ.9,122 కోట్ల నుంచి రూ.10,707 కోట్లకు చేరింది. పలు బ్రోకరేజ్ సంస్థలు రూ.10,330 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశాయి. 2024 ఆర్థిక సంవత్సరం క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ. 17,667 కోట్ల నుంచి రూ.19,093 కోట్లకు చేరింది. విశ్లేషకులు రూ.18,950 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని అంచనా వేశారు. శనివారం సమావేశమైన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.10 చొప్పున డివిడెండును సిఫార్సుచేసింది. 

రూ.25,000 కోట్ల నిధుల సమీకరణ

దేశీయ మార్కెట్లలో నాన్ డిబెంచర్లతో సహా డెట్ సెక్యూరిటీలను జారీచేసి రూ.25,000 కోట్ల వరకూ నిధులు సమీకరించే ప్రతిపాదనను బ్యాంక్ బోర్డు ఆమోదించింది. అలాగే గతంలో జారీచేసిన డెట్ సెక్యూరిటీలను బ్యాంక్ బైబ్యాక్ చేసే అనుమతిని సైతం బోర్డు ఇచ్చింది. 

తగ్గిన ఎన్‌పీఏలు

తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 2023 మార్చితో పోలిస్తే 2.81 శాతం నుంచి 2.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.48 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. పరిమాణం రీత్యా చూస్తే ఈ ఏడాది జనవరి స్థూల ఎన్‌పీఏలు రూ.27,961 కోట్లుకాగా, క్యూ3లో ఇవి రూ.28,775 కోట్లు. గత ఏడాది క్యూ4లో రూ.31,183 కోట్లు. బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో          (సీఏఆర్) స్వీక్వెన్షియల్‌గా 14.61 శాతం నుంచి 16.33 శాతానికి చేరింది. అయితే గత ఏడాది క్యూ4లో నమోదైన 18.34 శాతంకంటే తగ్గింది. ఎన్‌పీఏలపై ప్రొవిజినింగ్ కవరేజ్ రేషియో 80.3 శాతంగా ఉన్నది.

19 శాతం పెరిగిన డిపాజిట్లు

2024 మార్చి 31నాటికి బ్యాంక్ డిపాజిట్లు 19.6 శాతం వృద్ధితో రూ.14,12,825 కోట్లకు చేరాయి. రుణాలు 16.8 శాతం పెరిగి రూ.11,50,955 కోట్ల వద్ద నిలిచాయి.  కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ రేషియో 38.9 శాతంగా ఉన్నది.