పోస్టల్ సేవింగ్స్ చేద్దామా!

28-04-2024 01:59:54 AM

సురక్షిత మదుపు సాధనాల్లో అగ్రతాంబూలం పోస్టాఫీసు పథకాలదే. ఈ పత్రాల్లో చేసిన పెట్టుబడి, రాబడికి కేంద్ర ప్రభుత్వం పూర్తి గ్యారంటీ ఉంటుంది. అంతేకాదు..ఇతర సాంప్రదాయ మదుపు పత్రాలైన బ్యాంక్ పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లకంటే పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ ఎక్కువ. ఈ స్కీమ్‌లకు వడ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికానికోసారి కేంద్ర ఆర్థిక శాఖ సవరిస్తుంది. తాజాగా 2024 ఏప్రిల్ త్రైమాసికానికి అంతక్రితం జనవరి త్రైమాసికం తరహాలోనే అట్టిపెట్టింది. పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) బహుళప్రాచుర్యం పొందాయి.

పన్ను ప్రయోజనాలు ఉంటాయా?

అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పన్ను ప్రయోజనాలు ఉండవు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ మినహాయింపు ఎన్‌ఎస్‌సీ, ఎస్‌సీఎస్‌ఎస్, ఎస్‌ఎస్‌వై, పీపీఎఫ్‌లకు వర్తిస్తుంది. ఈ సెక్షన్ కింద కిసాన్ వికాస్ పత్ర, పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు (ఐదేండ్ల కాలపరిమితికి తప్ప), పోస్టాఫీసు మంథ్లీ ఇన్‌కం స్కీమ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్‌లకు మినహాయింపు వర్తించదు. 

వడ్డీ రేట్లను ఎలా నిర్ణయిస్తారు?

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు తగిన యంత్రాంగాన్ని శ్యామలా గోపీనాథ్ కమిటీ ప్రతిపాదించింది. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం  వివిధ స్కీమ్‌లపై వడ్డీ రేట్లను ఆయా స్కీమ్‌ల కాలపరిమితులతో సమానమైన ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌కంటే 25 నుంచి 100 బేసిస్ పాయింట్లు (0.25 శాతం నుంచి 1 శాతం) అధికంగా నిర్ణయించాలి. 2023 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో కొన్ని పోస్టాఫీసు స్కీమ్స్‌పై చివరిసారిగా ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. పీపీఎఫ్‌పై మాత్రం వడ్డీ రేటును 7.1 శాతం వద్దే అట్టిపెట్టింది. 

వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు

స్కీమ్ వడ్డీ రేటు శాతం అసలుతో వడ్డీని 
(2024 ఏప్రిల్ 1 నుంచి కలిపే వ్యవధి
జూన్ 30 వరకూ)



పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ 4 ఏడాదికోసారి
ఒక ఏడాది టైమ్ డిపాజిట్ 6.9 మూడు నెలలకోసారి
రెండేండ్ల టైమ్ డిపాజిట్ 7 మూడు నెలలకోసారి
మూడేండ్ల టైమ్ డిపాజిట్ 7.1 మూడు నెలలకోసారి
ఐదేండ్ల టైమ్ డిపాజిట్ 7.5 మూడు నెలలకోసారి
ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ 6.7 మూడు నెలలకోసారి
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 8.2 ప్రతీ మూడు నెలలకు చెల్లింపు
మంథ్లీ ఇన్‌కం అకౌంట్ 7.4 నెలకోసారి చెల్లింపు
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7 ఏడాదికోసారి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 ఏడాదికోసారి
కిసాన్ వికాస్ పత్ర 7.5 ఏడాదికోసారి
మహిళా సమ్మాన్ సేవింగ్స్ 7.5 మూడు నెలలకోసారి
సుకన్య సమృద్ధి యోజన 8.2 ఏడాదికోసారి