07-12-2025 08:39:31 PM
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక..
కాటారం (విజయక్రాంతి): జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు వివిధ విభాగాల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచారు. సైన్స్ సెమినార్ లో సృజన అనే విద్యార్థిని ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. సీనియర్ కేటగిరీలో అస్వద్, అబ్దుల్ రెహన్ అనే విద్యార్థులు నీటి సంరక్షణ, నిర్వాహణపై వాటర్ వైస్ ప్యూచర్ బ్రైట్ అనే వినూత్న ఆలోచనతో రూపొందించిన ప్రాజెక్ట్ ద్వితీయ బహుమతి సాధించింది. జూనియర్ కేటగిరీలో గ్రీష్మవేద, జష్మిత ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో రూపొందించిన ఆటో డ్రైన్ గేట్ ప్రాజెక్ట్ ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది.
సాంస్కృతిక విభాగంలో గ్రూప్ డ్యాన్స్ ప్రథమ బహుమతి, సోలో సింగింగ్ నవ్య మొదటి బహుమతి సాధించారు. జిల్లా స్థాయి స్కిట్ లో పర్యావరణ పరిరక్షణపై ఇచ్చిన ప్రదర్శన సైతం మొదటి స్థానం సాధించి అందరిని ఆలోచింపజేసింది. విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో అన్ని విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను, గైడ్ టీచర్లను ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ జనగామ కృషిత, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు సన్మానించి అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.