క్రమశిక్షణ తప్పితే.. చర్యలు తప్పవు
ప్రభుత్వ ఉద్యోగులు వారి విధి నిర్వహణలో చేసే నిర్లక్ష్యం. దుష్ప్రవర్తనకు సంబంధించి జరిమానాలను టీఎస్ సీసీఏ రూల్స్ 1991 కింద విధిస్తారు. ఈ జరిమానాలను రెండు రకాలుగా వర్గీకరించారు. వీటి గురించిన అవగాహన అవసరం. ఈ జరిమానాలు పలు రకాలుగా ఉంటాయి. ఎ. మైనర్ పెనాల్టీస్ అంటే చిన్న జరిమానాలు. 1. మందలింపు. 2. పదోన్నతిని నిలిపివేయడం. 3. ప్రభుత్వానికి కలిగిన ఆర్థిక నష్టాన్ని అతని జీతం నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా రికవరీ చేయడం. 4. సంచిత ప్రభావం లేకుండా వార్షిక వేతన పెంపును నిలిపివేయడం. 5. ఒక వ్యక్తి ఇప్పటికే రూల్ 8 కింద సస్పెండ్ చేయబడినచో ఒక నిర్దిష్ట జరిమానాగా సస్పెన్షన్‌ను పేర్కొనడం.
బి. మేజర్ పెనాల్టీస్ అంటే పెద్ద జరిమానాలు. 6. సంచిత ప్రభావంతో వార్షిక వేతన పెంపును నిలిపివేయడం. 7. సీనియారిటీ జాబితాలో తక్కువ ర్యాంకుకు తగ్గించడం లేదా అతను నేరుగా నియామకం పొందిన స్థాయి కంటే తక్కువ కాకుండా మరో తక్కువ పోస్టుకు తగ్గించడం లేదా అతను నేరుగా నియామకం పొందిన స్థాయి కంటే తక్కువ కాకుండా తక్కువ కాలపరిమితి స్కేల్‌కు లేదా కాలపరిమితి స్కేల్‌లో తక్కువ స్థాయికి తగ్గించడం. 8. నిర్బంధ పదవీ విరమణ. 9. తొలగింపు. 10. బర్తరఫ్. ముఖ్య గమనిక: మైనర్ పెనాల్టీని తక్కువ ప్రాముఖ్యత కలిగినదిగా భావించడం పొరపాటు. GOMsNo 342 GAD(Ser), dated. 4--- ప్రకారం ఏదైనా మైనర్ పెనాల్టీ విధిస్తే, కనీసం ఒక సంవత్సరం పాటు ప్రమోషన్ నిలిపివేయబడుతుంది.
రూల్ 10(i) ప్రకారం జరిమానా అనేది కేవలం లాస్ట్ గ్రేడ్ సర్వీస్ సభ్యులకు, నిబంధనలోని అనుబంధం I లో పేర్కొన్న ఇతర పోస్టుల హోల్డర్లకు మాత్రమే విధిస్తారు. రూల్ 10(ii) ప్రకారం ఫారెస్ట్ గార్డులు, ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్‌లో నేరుగా నియామకమైన సభ్యులు, ఏపీ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ సర్వీసెస్, ఏపీ ఫైర్ సబార్డినేట్ సర్వీసెస్‌లోని కొన్ని వర్గాలకు 15 రోజులకు మించకుండా సస్పెన్షన్ పెనాల్టీని విధించవచ్చు. సెన్సూర్ అనేది ఒక అధికారిక పెనాల్టీ. ఒక గద్దింపు చర్య అని అనుకోవచ్చు. విధి నిర్వహణలోపం లేదా నిర్లక్ష్యానికి పాల్పడిన వ్యక్తికి దీన్ని అపరాధ రూపంలో విధిస్తారు. ఉద్యోగికి సెన్సూర్ విధించినట్లయితే, అతను ఒక సంవత్సరం వరకు ప్రమోషన్‌కు అనర్హుడు.
వార్నింగ్ (హెచ్చరిక) అనేది అధికారిక పెనాల్టీ కాదు. ఇది నిబంధనలో లేదు. నిర్లక్ష్యం లేదా పొరపాటు జరిగినప్పుడు అధికారిక పెనాల్టీ అవసరం లేదని భావించినప్పుడు వార్నింగ్ ఇస్తారు. కానీ, క్రమశిక్షణ చర్యల ముగింపులో ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చిన వార్నింగ్ అనేది అతను పూర్తిస్థాయిలో నిర్దోషిగా తేలలేదని సూచిస్తుంది. సెలక్షన్ పోస్టులో ఎంపిక ప్రక్రియలో ఇది సదరు ప్రభుత్వ ఉద్యోగిపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.
ఒక వ్యక్తిని సేవ నుంచి తొలగించడం (రిమూవల్) అనేది అతన్ని భవిష్యత్తులో ఉద్యోగం పొందకుండా అనర్హుడ్ని చేయదు. కానీ, డిస్మిస్ చేయడం అనేది సాధారణంగా భవిష్యత్తులో ఏ ఇతర ఉద్యోగం పొందకుండా చేస్తుంది. ఏదైనా అధికారిక పనిని చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి చట్టబద్ధమైన వేతనం కాకుండా ఏ ఇతర వ్యక్తి నుంచి అయినా ప్రతిఫలాన్ని స్వీకరించినట్లు రుజువైన ప్రతి సందర్భంలోనూ తొలగింపు లేదా డిస్మిసల్ అనే పెనాల్టీ విధిస్తారని గ్రహించాలి.
గెజిటెడ్ అధికారులపై పెనాల్టీలను విధించడానికి కాంపిటెంట్ అథారిటీలను 11వ నిబంధనలో సూచించారు. ఒకవేళ అటువంటి కాంపిటెంట్ అథారిటీ లేని పక్షంలో సాధారణ నియమం ఏమిటంటే నియామక అధికారిగా ప్రకటించిన ప్రతి శాఖాధిపతి తన నియంత్రణలో ఉండే గెజిటెడ్ పోస్టులో పనిచేస్తున్న రాష్ట్ర సర్వీసెస్ సభ్యునిపై తొలగింపు, డిస్మిస్ తప్ప మిగిలిన ఏ పెనాల్టీనైనా విధించవచ్చు. గెజిటెడ్ అధికారులను తొలగించటం లేదా డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది.
సబార్డినేట్ సర్వీసెస్ అధికారులపై జరిమానాలు విధించే కాంపిటెంట్ అధికారుల గురించి రూల్ 14లో పేర్కొన్నారు. అటువంటి నిర్దిష్ట నిబంధన లేనప్పుడు సాధారణ నియమం ఏమిటంటే అభిశంసన, ఇంక్రిమెంట్ నిలిపివేయడం మొదలగు జరిమానాలను ప్రభుత్వ ఉద్యోగిపై అతని తక్షణ ఉన్నత గెజిటెడ్ అధికారి విధించవచ్చు. ఒకవేళ సదరు సభ్యుడిని నియమించే అధికారి గెజిటెడ్ అధికారి కాకపోతే అటువంటి అధికారి లేదా అంతకంటే ఉన్నతాధికారి ఈ జరిమానాలను విధించవచ్చు.
తక్షణ ఉన్నత గెజిటెడ్ అధికారి లేదా నియామక అధికారి కంటే పై స్థాయిలో ఉన్న అధికారి లేదా అంతకంటే ఉన్నతాధికారి జీతం నుంచి వసూలు చేసే జరిమానాని కూడా విధించవచ్చు. నియామక అధికారి లేదా అంతకంటే ఉన్నతాధికారి సబార్డినెట్ సర్వీస్ సభ్యులపై ఏదైనా నిర్దిష్ట తప్పు లేదా దుష్ప్రవర్తనకు సంబంధించి ఈ కింది జరిమానాలను విధించవచ్చు. 1. పదోన్నతిని నిలిపివేయడం. 2. అవసరమని భావించిన మేరకు సస్పెన్షన్. 3. తక్కువ పదవికి తగ్గించడం. 4. నిర్బంధ పదవీ విరమణ. 5. తొలగింపు, భర్తరఫ్. ఏదైనా సందర్భంలో ఉన్నతాధికారి జరిమానా విధించిన లేదా విధించడానికి నిరాకరించిన, ఆ విషయంలో దిగువ స్థాయి అధికారికి ఎటువంటి అధికార పరిధి ఉండదు.
అయితే దిగువ స్థాయి అధికారి జరిమానా విధించిన లేదా సభ్యుడిని దోషముక్తి చేసిన అది ఉన్నతాధికారి తన అధికారాలను వినియోగించకుండా అడ్డుకోదు. ఉన్నతాధికారి జారీచేసే ఆదేశాలు దిగువ స్థాయి అధికారి జారీచేసిన ఏవైనా ఆదేశాల కంటే ప్రాధాన్యత కలిగి ఉంటాయి.
ఒక ఉద్యోగి సేవలను ఒక విభాగం నుంచి మరొక విభాగానికి డిప్యుటేషన్ మీద ఇచ్చినప్పుడు సదర్ వ్యక్తికి తప్పనిసరి పదవీ విరమణ, తొలగింపు, బర్తరఫ్ వంటి శిక్షణ విధించే అధికారం మాతృసంస్థకు మాత్రమే ఉంటుంది. డిప్యుటేషన్ తీసుకున్న సంస్థ అటువంటి శిక్షలు అవసరమని భావిస్తే విచారణ అధికారిని నియమించి లేదా స్వయంగా విచారణ జరిపి ఆ రికార్డులను మాతృసంస్థకు పంపాలి. కానీ, ఇతర చిన్న శిక్షణను మాత్రం డిప్యుటేషన్ తీసుకున్న సంస్థ మాతృసంస్థను సంప్రదించి విధించవచ్చు.
ఒక ఉద్యోగి సేవలను ఒక కంపెనీకి, కార్పొరేషన్‌కు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి ఉండే ఇతర సంస్థలకు డిప్యుటేషన్‌గా ఇచ్చినప్పుడు డిప్టేషన్ నిబంధనలకు లోబడి సదరు ఉద్యోగిని డిప్యుటేషన్ తీసుకున్న సంస్థ సస్పెండ్ చేయవచ్చు లేదా రూల్ 9లోని (i to iv) వరకు గల శిక్షలను లేదా రూల్ 10లోని (i) శిక్షను విధించవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రమే సస్పెండ్ చేయడానికి లేదా శిక్షలు విధించడానికి అధికారం ఉన్న పోస్టులకు ఇది వర్తించదు.
డిప్యుటేషన్ తీసుకున్న సంస్థ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగిని సస్పెండ్ చేసినప్పుడు, ఆ వివరాలను వెంటనే మాతృసంస్థకు నివేదించాలి. ఒకవేళ మాతృసంస్థ ఆ సస్పెన్షన్‌తో ఏకీభవించకపోతే సదరు ఉద్యోగి సేవలను తిరిగి డిప్యుటేషన్ ఇచ్చిన సంస్థకే అప్పగించాలి. తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కంపెనీలు, కార్పొరేషన్లు లేదా స్థానిక సంస్థల నుంచి అధికారులను డిప్యుటేషన్ మీద తీసుకున్నప్పుడు కూడా పైన పేర్కొన్న విధానాల్ని అనుసరించాలి. శిక్షలు అనేవి ప్రవర్తనను సరిదిద్దడానికి ఉన్నప్పటికీ, ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం ఆర్థిక లేదా వృత్తిపరమైన భారాలను మోపడం మాత్రమే కాదు క్రమశిక్షణ, నిజాయితీగల ఉద్యోగులను, సిబ్బందిని తయారు చేయడమని గుర్తెరగాలి.
వ్యాసకర్త: రిటైర్డ్ ప్రభుత్వ అధికారి






