24 April, 2026 | 1:52 AM

గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం

24-04-2026 12:00 AM

భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే నివసిస్తుందని, గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి పథంలో పయనిస్తుందని జాతిపిత మహాత్మాగాంధీ ప్రగాఢంగా విశ్వసించారు. ఆయన కలలు గన్న ‘గ్రామ స్వరాజ్యం’ కేవలం ఒక రాజకీయ నినాదం కాదు, అది ఒక సామాజిక, ఆర్థిక విప్లవం. ఆ ఆశయ సాధనలో భాగంగా ఉద్భవించిన ‘పంచాయతీరాజ్ వ్యవస్థ’ నేడు భారత ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తోంది.  ఏటా ఏప్రిల్ 24న జరుపుకొనే ‘జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం’ మన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయాణాన్ని పునశ్చరణ చేసుకోవడానికి, స్థానిక స్వపరిపాలన విజయాలను విశ్లేషించుకోవడానికి ఒక గొప్ప సందర్భం. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక పరిణామాలు, రాజ్యాంగపరమైన సంస్కరణలు, వర్తమాన సామాజిక పరిస్థితుల్లో దాని ప్రాధాన్యతను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

భారతదేశంలో పంచాయతీ వ్యవస్థ ఆధునిక కాలపు సృష్టి కాదు; ఇది అత్యంత పురాతనమైన, సంప్రదాయబద్ధమైన పాలనా పద్ధతి. వేద కాలం నాటి ‘సభ’, ‘సమితి’ల నుంచి నేటి గ్రామ పంచాయతీల వరకు దీని ప్రస్థానం కొనసాగుతోంది. ప్రాచీన భారతదేశంలో గ్రామం ఒక స్వయంప్రతిపత్తి గల యూనిట్‌గా ఉండేది. ముఖ్యంగా చోళుల కాలంలో అమలైన ‘కుడవోలై’ ఎన్నికల పద్ధతి, గ్రామీణ పాలనలో ప్రజల భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి నిదర్శనం.

అయితే మధ్యయుగంలో, బ్రిటిష్ పాలన ప్రారంభంలో ఈ వ్యవస్థ కొంత బలహీనపడింది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ 1882లో స్థానిక స్వపరిపాలనపై ప్రవేశపెట్టిన తీర్మానం ఆధునిక పంచాయతీరాజ్ వ్యవస్థకు తొలి అడుగుగా నిలిచింది. అందుకే ఆయనను ‘స్థానిక స్వపరిపాలనా పితామహుడి’గా గౌరవిస్తారు. స్వాతంత్య్రానంత రం రాజ్యాంగ రూపకల్పన సమయంలో గాంధేయవాదులు పట్టుబట్టడంతో ఆర్టికల్ 40 ద్వారా గ్రామ పంచాయతీల ఏర్పాటును ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. గ్రామీణాభివృద్ధి కోసం 1952లో ‘సమాజ వికాస పథకం’, 1953లో ‘జాతీయ విస్తరణ సేవా పథకం’ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది.

కానీ, ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం తో, వైఫల్యానికి గల కారణాలను అన్వేషించడానికి 1957లో బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షతన ఒక ఉన్న త స్థాయి కమిటీని నియమించారు. ప్రజల భాగస్వామ్యం లేని ఏ కార్యక్రమమూ విజయవంతం కాదని ఈ కమిటీ కుండబద్దలు కొట్టింది. ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ’ అనే భావనను ప్రతిపాదిస్తూ, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను బల్వంత్ రాయ్ మెహతా సిఫారసు చేశారు.

దీనివల్లనే ఆయనను ‘భారత పంచాయతీరాజ్ పితామహుడి’గా అభివర్ణిస్తారు. ఆయన సిఫారసుల మేరకు 1959 అక్టోబర్ 2న రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జవహర్‌లాల్ నెహ్రూ పంచాయతీరాజ్ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్ 1న ఏపీలోని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఈ వ్యవస్థ అమల్లోకి రావడం విశేషం.

బల్వంత్ రాయ్ మెహతా కమిటీ తర్వాత పంచాయతీల బలోపేతంపై అశోక్ మెహతా (1977), జి.వి.కె రావు (1985), ఎల్.ఎం సింఘ్వి (1986) వంటి అనేక కమిటీలు విలువైన సూచనలు చేశాయి. ముఖ్యంగా ఎల్.ఎం సింఘ్వి కమిటీ పంచాయతీలకు ‘రాజ్యాంగ హోదా’ కల్పించాలని కోరడం వల్ల ఈ వ్యవస్థకు చట్టబద్ధమైన రక్షణ లభించింది. ఈ పరిణామాల ఫలితంగానే 1992లో పి.వి నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది.

1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారితీసింది. రాజ్యాంగంలో 9వ భాగం, 11వ షెడ్యూల్‌లను చేర్చడం ద్వారా పంచాయతీలకు రాజ్యాంగబద్ధమై న అధికారం లభించింది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం, నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడంతో ఈ సంస్థలకు స్థిరత్వం చేకూరింది. ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపే తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన రాజకీయ అనిశ్చితిని తొలగించింది.

పంచాయతీరాజ్ వ్యవస్థ సాధించిన అతిపెద్ద విజయాల్లో మహిళా సాధికారత అగ్రస్థానంలో నిలుస్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు కనీసం 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించగా, నేడు అనేక రాష్ట్రాల్లో ఇది 50 శాతానికి చేరింది. పురుషాధిక్య సమాజంలో ఇదొక మౌన విప్లవంగా సాగుతోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల సామాజిక న్యాయం సాధ్యమైంది. అధికార కేంద్రాలుగా ఉన్న పంచాయతీలు నేడు సామాజిక సమానత్వానికి ప్రతీకలుగా మారుతున్నాయి. అయితే, పంచా యతీల్లో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతోంది. నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల పైనే ఆధారపడటం వల్ల ఆర్థిక స్వయంప్రతిపత్తి కొరవడుతోంది.

పంచాయతీలకు సొంత పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులు ఉన్నప్పటికీ, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సాంకేతిక, పరిపాలనాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు రాజకీయ పార్టీల జోక్యం, సర్పంచులకు సరైన అధికారాలు లేకపోవడం వంటివి క్షేత్రస్థా యిలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ‘ఈ-గ్రామ్ స్వరాజ్’ వంటి డిజిటల్ వ్యవస్థలు వచ్చినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడంతో పారదర్శకత ఇంకా ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు.

ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం, ప్రజలు భాగస్వాములు కావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక’ (జీపీడీపీ) ద్వారా గ్రామస్థులే తమ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో బడ్జెట్‌ను రూపొందించుకోవడం ఒక శుభపరిణామం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పంచాయతీల పాత్ర కీలకమైనది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాల్లో ఎక్కువ భాగం గ్రామీణ స్థాయిలోనే నెరవేర్చాల్సి ఉంటుంది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని గ్రామాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య భారత్ వంటి లక్ష్యాలు పంచాయతీల చురుకైన భాగస్వామ్యం ద్వారానే సాధ్యం. గ్రామసభలను నామమాత్రపు సమావేశాలుగా కాకుండా, చర్చా వేదికలుగా తీర్చిదిద్దాలి. వార్డు సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు అందరికీ పారదర్శకత, జవాబుదారీతనంపై శిక్షణ ఇవ్వాలి.

పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక పరిపాలనా విభాగమే కాదు; అది ప్రజాస్వామ్య దేశానికి పునాది. అధికారం ప్రజల వద్దకు వెళ్లినప్పుడే ఆ ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న తరుణంలో, మన పల్లెలు ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడటం విచారకరం. రాజకీయ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం తోడైతేనే గ్రామ స్వరాజ్యం సిద్ధాంతం ఆచరణలోకి వస్తుంది. ‘ప్రజాస్వామ్యం పై నుంచి కిందికి కాకుండా, కింది స్థాయి నుంచి పైకి నిర్మించబడాలి’ అన్న గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, పంచాయతీలను నిజమైన ‘గ్రామ ప్రభుత్వాలు’గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మనం చేసే ప్రతిజ్ఞ, మన గ్రామాలను స్వయం సమృద్ధి గల, ఆదర్శవంతమైన గ్రామాలుగా మార్చడమే కావాలి. నవ భారత నిర్మాణానికి బలమైన పంచాయతీలే అసలైన బాటలు. దీనికోసం చట్టాలు, నిధులు ఎంత ముఖ్యమో, ప్రజల్లో చైతన్యం కూడా అంతకంటే ముఖ్యం. అప్పుడే మన ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయిలో వికసిస్తుంది, దేశం సుస్థిరమైన ప్రగతిని సాధిస్తుంది.

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494