24 April, 2026 | 1:40 AM

ఉపాధి హామీ.. సౌకర్యాల లేమి!

24-04-2026 12:34 AM
  1. తాగునీరు, నీడ లేక ఎండలోనే కూలీల శ్రమ
  2. చలువ పందిళ్లు లేక చెట్ల కిందే విశ్రాంతి
  3. ఓఆర్‌ఎస్, మెడికల్ కిట్లు చూడని కూలీలు
  4. పొంచిఉన్న వడదెబ్బ ముప్పు
  5. ఇప్పటికైనా వసతులు కల్పించాలంటున్న కూలీలు 

చివ్వెంల, ఏప్రిల్ 23: ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత ఎంత ఎక్కు వగా ఉన్నా పొట్టకూటి కోసం పనులకు వెళ్ల క తప్పని పరిస్థితి. ఉదయం 7 గంటల నుం చి 11 గంటల వరకు పనులు నిర్వహిస్తున్నప్పటికీ వేడి తీవ్రత తగ్గకపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారు.

పనికోసం సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండగా, ఉదయం 6 గంటలకే కూలీలు సొంతంగా నీటి బాటిళ్లు, అన్నం బాక్సులు, పనిముట్లు తీసుకుని పనిస్థలాలకు వెళ్తున్నారు. పనులు జరుగుతున్న చోట ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలకు అవస్థలు తప్పడం లేదు.

కనీస వసతులు కరువు 

మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో ప్రతి రోజూ  1300 మంది వరకు కూ లీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. గతంలో రోజుకు రూ.257గా ఉన్న కూలీని ప్రస్తుతం రూ.272కు పెంచినప్పటికీ, కనీస సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా అవి అమలు కావడం లేదు. వేసవి తీవ్రత దృష్ట్యా విశ్రాంతి కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో ఈ ఏర్పాట్లు కనిపించడం లేదు. దీంతో కూలీలు చెట్ల కిందే సేదతీరాల్సి వస్తోంది. చెట్లు లేని ప్రాంతాల్లో ఎండలోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కనిపించని మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు 

పని ప్రదేశంలో కూలీలకు గాయాలయితే ఉపయోగపడే మెడికల్ కిట్లు, డీహైడ్రేషన్ నివారణకు అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూలీలకు అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో కూలీలే సొంతంగా నీటి బాటిళ్లు తీసుకెళ్లాల్సి వస్తోంది. పనిముట్లు కూడా సరిపడా అందించడం లేదని కూలీనే చెబుతున్నారు.

అమలుకు నోచుకోని ఆదేశాలు

ప్రభుత్వం ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు కల్పించి వడదెబ్బ నుండి కూలీలను రక్షించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పనిస్థలాల్లో అవి కనిపించక కూలీలు అల్లాడుతున్నారు. అయితే సంబంధిత అధికారు లు మాత్రం స్పందించకపోవడం గమనా ర్హం. ఎండను సైతం లెక్క చేయక పని చేస్తు న్న కూలీలకు ఉపాధి పనుల వద్ద చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కూలీలు డిమాండ్ చేస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.

కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం 

కూలీలకు పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలను గ్రామపంచాయతీలే సమకూర్చాలి. గ్రామపంచాయతీల సహకారంతో అవసరమైన సౌకర్యాలు కల్పించి ఉపాధి హామీ కూలీలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

సంతోష్ కుమార్, 

ఎంపీడీఓ, చివ్వెంల