24 April, 2026 | 1:46 AM

ఆర్టీసీ సమ్మె ఉధృతం

24-04-2026 12:00 AM

ఆర్టీసీ కార్మికులు మోగించిన సమ్మె సైరన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రగతి రథచక్రాలు ఆగిపోవడంతో ప్రయాణికుల అవస్థల మధ్యనే సమ్మె మూడో రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో సమ్మె మరింత ఉధృతమైంది. వరంగల్ జిల్లా నర్సంపేట్‌లో జరిగిన మహాధర్నాలో ఓ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనను మరువకముందే నల్లగొండ డిపో ఎదుట మరో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడగా, తోటి కార్మికులు అడ్డుకోవడంతో పెనుప్రమాదం తప్పింది.

వరుస ఘటనల నేపథ్యంలో మంత్రివర్గం హుటాహుటిన స్పందించింది. క్యాబినెట్ మీటింగ్‌ను మధ్యలోనే వదిలేసి మరీ మీడియా సమావేశం నిర్వహించిన మంత్రులు కార్మికులకు తీపి కబురు చెబుతారనుకుంటే, ఊరించి ఉసురుమనించారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని పాత పాటే పాడటం గమనార్హం. ఆర్టీసీ కార్మికులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. దశాబ్దాలుగా ఆర్టీసీకి వారసత్వంగా వస్తున్న సమస్యలకు చరమగీతం పాడాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే వారు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం, 30 శాతం ఫిట్‌మెంట్‌తో 2021 వేతన సవరణ అమలు, పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదల, ఉచిత బస్సు పథకం బకాయిలు నెలనెలా విడుదల, ఉద్యోగ ఖాళీల భర్తీ తదితర డిమాండ్లు న్యాయసమ్మతమైనవే. కానీ, స్వరాష్ట్రం సిద్ధించిన నాటినుంచీ కార్మికులు పోరాడుతున్నా వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 2019లో ఆర్టీసీ కార్మికులు 52 రోజులపాటు చేసిన సమ్మెను నాటి సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని చూసినా, అది కార్యరూపం దాల్చలేదు.

గత ప్రభుత్వాన్ని మించి హామీలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా కాంగ్రెస్ సర్కార్ అమలుచేసిన ఉచిత బస్సు పథకం కారణంగా తమపై పనిభారం, సంస్థపై ఆర్థిక భారం మరింత ఎక్కువైందని గోడు వెళ్లబోసుకున్నా పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాల నేపథ్యంలో వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.