01-01-2026 12:42:58 AM
డిసెంబర్ 31, జనవరి 1న మద్యం నిషేధించాలి
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉమ్మ గాని హరీష్ డిమాండ్
ఇల్లందుటౌన్, డిసెంబర్ 31, (విజయక్రాంతి): మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని చెప్పే ప్రభుత్వం, అదే సమయంలో నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగించడం కూడా నేరమేనని దాని ద్వారా ప్రమాదాలకు ప్రభుత్వమే కారణమవుతోందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఉమ్మగాని హరీష్ ఆరోపించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో తనిఖీలు, కేసులు పెట్టడం ఒకవైపు సాగుతుండగా, మరోవైపు మద్యం షాపులు, గొలుసుకట్టు దుకాణాలను తెరిచి ఉంచి మద్యపానాన్ని ప్రోత్సహించడం వల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతంలో మద్యం సిండికేట్ వ్యవస్థ నెలకొల్పి, తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విక్రయాలకు అనుమతులు ఇవ్వడం దారుణమని విమర్శించారు.పర్యవేక్షణ పేరుతో తూతూ మంత్రం జరుగుతోందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలకు, అనుమతులకు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్యకు అసలైన పరిష్కారం మద్యం అమ్మకాలపైనే నిషేధమని స్పష్టం చేశారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్ తరఫున డిమాండ్ చేశారు.