01-01-2026 12:42:08 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పొరేష న్లు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరిగా విభజించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. హైదరాబాద్ నగరం ముక్కలు కాలేదని, 27 మున్సిపాలిటీల విలీనంతో మహా నగరంగా అవతరిం చిందని కమిషనర్ ఆర్‌వి కర్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సమీక్షలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌ణు ముక్కలు చేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల, ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం వల్ల నగరం 650 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2,000 చదరపు కిలో మీటర్లకు విస్తరించిందన్నారు. ఇంతటి భారీ నగరాన్ని ఒకే కేంద్రం నుంచి పాలించడం కష్టం కాబట్టి, ప్రజలకు పాలనను చేరువ చేసేందుకే నగరాన్ని 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా పునర్వ్యవస్థీకరించామని తెలిపారు. అందుకే జోన్ల వారీగా అద నపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను నియమించామని వివరించారు.
విస్తరించిన నగరంలో చెత్త ఉత్పత్తి రోజుకు 9 వేల మెట్రిక్ టన్నులకు చేరిందని కమిషనర్ తెలిపారు. ఒక్క జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సరిపోదని, కొత్తగా మరికొన్ని డంపింగ్ యార్డుల ఏర్పాటుకు భూసేకరణ జరుపుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలపడమే లక్ష్యమని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంపై 300 వార్డుల్లో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని వివరించారు.
పన్ను వసూళ్లలో హైటెక్ బాట
పన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ హైటెక్ బాట పట్టిందని, డ్రోన్ సర్వేలు, జీఐఎస్ మ్యాపింగ్‌తో నగరంలోని 14 లక్షల ఆస్తులను జల్లెడ పట్టామని కర్ణన్ వెల్లడించారు. కమర్షియల్ కరెంట్ వాడుతూ, రెసిడెన్షియల్ పన్ను కడుతున్న లక్ష మందికి పైగా యజమానులను గుర్తించామని, వీరి నుంచి ఇప్పటికే రూ.7.40 కోట్లు అదనంగా వసూలు చేశామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3,000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని వెల్లడించారు.
నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లన్నింటినీ వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హెచ్‌చ్‌సిటీ ప్రాజెక్టు కింద 32 పనులు త్వరలో ప్రారంభమవుతాయని, 1,121 కిలోమీటర్ల మేర నాలాలను మ్యాపింగ్ చేశామని చెప్పారు. వరద నివారణకు రూ.667 కోట్లతో పనులు చేపట్టామన్నారు. గతేడాదితో పోలిస్తే డెంగ్యూ కేసులు 30% తగ్గాయని చెప్పారు.