స్కూల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తా
సీఎంకు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తన నియోజకవర్గం ఆర్మూర్‌కు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాశారు. సీఎం, డిప్యూటీ సీఎం వారి నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేసుకున్నారని, రెండు దక్షిణ తెలంగాణకే కాకుండా ఉత్తర తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కలిసినప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని రాకేష్ రెడ్డి ప్రస్తావించారు.
ఆర్మూర్‌లో ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూల్ ఏర్పాటుపై వారం రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని కోరారు. లేదంటే ఆమరణ దీక్ష చేపడతానని పేర్కొన్నారు. కాగా, నార్త్, సౌత్ తెలంగాణ ప్రస్తావనతో ప్రాంతీయ సమస్యలను లేవనెత్తినట్లు అయింది. అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకే పెద్ద ఎత్తున నిధులను కేటాయించుకుంటారనే వాదనలు వినిపిస్తున్ననేపథ్యంలో రాకేష్ రెడ్డి కౌంటర్‌ను ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.






