07-01-2026 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
అంతర్గృహగతః స్థవిర స్త్రీ పరిశుద్ధాం దేవీం పశ్యేత్..
(కౌటిలీయం- 1--20)
రాజు వృద్ధులైన స్త్రీలచేత పరిశోధింపబడిన భార్యను తన అంతఃపురంలోనే దర్శించాలి, అంటాడు ఆచార్య చాణక్య. ఎందుకంటే.. పాలకునిగా ఎంత చక్కని పాలనను అందించినా శత్రువులు అధికంగానే ఉం టారు. భార్యను భయపెట్టి లేదా ప్రలోభాలకు గురిచేసి ఆమె ద్వారా రాజును చంపేం దుకు శత్రువులు ప్రయత్నిస్తారు. శత్రువుల నుంచి ఆత్మ రక్షణను పొందడం రాజు కర్త వ్యం. అందుకే అందరినీ నమ్మినట్లే ఉండి ఎవరినీ నమ్మని వైఖరి రాజులో కనిపిస్తుం ది. తనను తాను గౌరవించుకోలేని నాయకుడిని ఇతరులు గౌరవించరు.
అంతేకాదు, ఒక ప్పుడు రాజులు కొందరు భార్యా గృహాలలో హత్యలకు గురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాజు భార్యాగృహానికి వెళ్లడం క న్నా తన వద్దకే పిలిపించుకోవడం సమంజసమని చాణక్య భావించి ఉండవచ్చు. నేడు దేశాధినేతలకు, ప్రముఖులకు, భద్రత నిచ్చే వ్యవస్థలో వారు త్రాగే నీటి నుంచి ప్రతీది పరీక్షించి మాత్రమే ఇస్తారు. అదే సూత్రాన్ని చాణక్య చెప్పారు. అయితే మనం గుర్తించాల్సింది.. భార్యాభర్తల భాగస్వామ్యం పరస్ప ర అవగాహన, విశ్వాసాల వల్లనే పరిణతి చెందుతుంది.
కుటుంబం అనేది ఒక సంస్థ లేదా రాజ్యము అనుకుంటే దానిని నడిపే వి ధానం ప్రభుత్వం. ప్రభుత్వం అంటే సకలా న్నీ సమర్ధవంతంగా నిర్వహించే సామర్ధ్యము. ఏ సంస్థలోనైనా సంస్థకు సంబంధిం చిన అందరు వ్యక్తులూ పరస్పరాధారిత మా ర్గంలో భాగస్వాములవుతూ; సంస్థకు సం బంధించిన సంసృ్కతిని కాపాడుతూ తమ కర్తవ్యాలను సరిగా నిర్వహిస్తేనే ఆ సంస్థ లక్ష్యాన్ని చేరుతుంది.
అలాగే కుటుంబంలో భాగస్వాములైన భార్యాభర్తలు పరస్పరాధారిత మార్గంలో ముందుకు సాగితేనే ఆ కు టుంబానికి సంబంధించిన సంసృ్కతి కాపాడబడుతుంది. కుటుంబంలో అంతిమ లక్ష్య మైన శాంతి, ఆనందమూ నిలుస్తుంది. సంస్థ లో ఎలాగైతే ఒడుదొడుకులు సహజమో అ లాగే కుటుంబంలో కూడా ఒడుదొడుకులు సహజమే. వాటిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.
ఇష్టాయిష్టాలు..
ప్రభుత్వం సంపద, సంక్షేమాలు.. ఆ సం స్థ లేదా ప్రభుత్వంపై ఆధారపడిన ఉద్యోగుల/ ప్రజల సంపద, సంక్షేమాలపై లేదా అ నందంపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఇల్లు అనే ప్రభుత్వంలో ఆ ఇంటిలోని సభ్యు లు ఎవరైనా తమ ఉత్పత్తి, ఉత్పాదకతల సా మర్ధ్యాన్ని పెంచుకున్నా లేదా చేసే వృత్తిలో అధికంగా లాభాలను ఆర్జించినా వారిని ప్రో త్సహించాలే కాని ఆత్మన్యూనత/ఆధిక్య భా వనతో వారిని అణిచివేసే ప్రయత్నం చేయకూడదు.
ఇక్కడ సంపద అంటే ఫలితాలు, శాంతి సౌభాగ్యాలే కానీ డబ్బు మాత్రం కాదు. ప్రభుత్వం వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ప్రజల అవసరాలు తీరుతాయి. అం దుకే లావాదేవీలను క్రమబద్ధీకరించడం, వా ణిజ్య ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వ లక్షణంగా ఉండాలి.
అలాగే ఇంటిలోని స భ్యుల మధ్య అవగాహనతో కూడిన, పారదర్శకమైన, పరిణతితో కూడిన భావోద్వేగాలు వెలుగుచూసిన వేళ సభ్యులందరూ ఆ విధానాన్ని ఆమోదించడం, ఎదుటివారి ఇష్టాయి ష్టాలను గౌరవించడం వల్ల ఆ ఇంటిలో సంపద వెల్లివిరుస్తుంది. అది భార్యాభర్తల కర్తవ్యంగా ఉండాలి.
సమాన పాత్ర అవసరం..
ఎలాగైతే అనుక్షణం మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు సంస్థ/ ప్రభుత్వ నిర్వహణపై ప్రభావం చూపుతా యో.. అలాగే ఇంటిలో భార్యాభర్తలపై కూ డా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు ప్రభావాన్ని చూపుతాయి. ఆర్థిక ఒడుదొడుకులు ఎదురవ్వొచ్చు. పరస్పర అంచనాలు, ఊహలు తారుమారు కావచ్చు. వృత్తి ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధించలేని అసమర్ధత, అసంతృప్తికి గురిచేయగా అది సంసారిక జీవితంపై ప్రభావాన్ని చూపవచ్చు.
అలాగాక ఇరువురూ తమ వృత్తి జీవితంలో అంచనాలను అధిగమించినా, విజయ సాధకులైనా ఆ విజయం నిరర్ధక విజయం కాకూడదనుకున్నా, సార్ధకమూ, సుసంపన్నం, సు స్థిరం కావాలన్నా, భాగస్వాములిద్దరూ ఇం టిలో నాయకుని పాత్రను పోషించాల్సి ఉం టుంది. నాయకుడు తన అనుచరులను లేదా సహచరులను తన విజయంలో భాగస్వాములను చేస్తాడు. అలాగే ఇంటిలో భా ర్య/ భర్త తన భాగస్వామిని తన విజయంలో సంపూర్ణ భాగస్వామిని చేయగలగాలి.
సంస్థ విజయం ఆ సంస్థలోని ఉద్యోగుల మానసిక స్థితి, సృజనాత్మకత, కొత్తదనాన్ని అవిష్కరించడం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ పరస్పరాధారిత పనితీరులో, ఒత్తిడి లేని వాతావరణంలో వె లుగు చూస్తుంది, ముందుకు సాగుతుంది. ఆ వాతావరణాన్ని కల్పించడం నాయకుని బాధ్యత. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు, సహేతుకమైన చర్చలు, సకారాత్మక విశ్లేషణలు, సత్యశోధనా విధానంలో చేసే విమర్శలు, భయరహితమైన భావవ్యక్తీకరణలు సంస్థలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుతాయి. సరిగ్గా ఇవే కుటుంబంలో ఆవిష్కృతమైతే ఆ గృహంలో శాంతి, సౌభాగ్యం, ఆనందం వెలుగుచూస్తాయి.
ఉనికి ప్రశ్నార్థకం!
ఈ వాతావరణం వెలుగు చూడాలంటే కుటుంబ సభ్యులు పరస్పరం మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగపరంగా సహకరించుకోవాలి. నీవెంట మేమున్నామనే భరోసాని వ్వాలి. అప్పుడే సంస్థయైనా, కుటుంబమైనా వికసిస్తుంది, ఎదుగుతుంది, విస్తరిస్తుంది, అపరిమితంగా వ్యాప్తమౌతుంది. ఒకప్పుడు ఒక సంస్థ ఉత్తమ ఫలితాలు సాధించి ఉండవచ్చు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థ గా పేరు ప్రఖ్యాతలు గడించి ఉండవచ్చు.
యాజమాన్యం మారాక పరిణతిలేమితో తీసుకున్న నిర్ణయాలు, ఆశయం స్థానంలో వెలుగుచూసిన ఆశలు ఆ సంస్థ ప్రతిష్ఠను తగ్గించే అవకాశమున్నది. ఉత్పత్తి ఉత్పాదకతలు తగ్గి ఫలితంగా లాభాలపై ప్రభావాన్ని చూపవచ్చు. ఆ సమయంలో కొత్త ఆలోచనలతో సంయమనతతో పరిస్థితులను చర్చిం చి అవసరమైన మార్పులు చేర్పులు చేయ డం ద్వారా పరిస్థితిని సరిచేయాలే కానీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ బాధ్య తను మరొకరిపై నెట్టివేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ ప్రక్రియ వల్ల సంస్థ ఉనికి ప్రశ్నార్ధకమౌతుంది.
ఇదే సూత్రం కుటుంబానికి కూడా వర్తిస్తుంది. అపరిణత మనసులు చిన్న సమస్యను పెద్దదిగా మారుస్తూ శాంతి ఆనందాలకు దూరమవుతూ, దానికి బాధ్యులుగా ఒకరినొకరు నిందించుకుంటూ పోతే కుటుంబం అస్తవ్యస్తమౌతుంది. జీవితాలు నిరాసక్తంగా ముగుస్తాయి. వృత్తిరీత్యా ఉన్నత స్థానాన్ని పొందినా, విజయాలు సాధించినా అవి నిరర్ధక విజయాలుగా పరిణమిస్తాయి.