calender_icon.png 8 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాయ్‌కాట్‌లతో ఎవరికి లాభం?

07-01-2026 12:00:00 AM

జూకంటి జగన్నాథం :

* ప్రస్తుత శాసనసభను బహిష్కరించడం వల్ల ప్రతిపక్షం తమ హయాంలో జరిగిన అసలు వాస్తవాలు సభ దృష్టికి తీసుకువచ్చి, ప్రజల ముందు నిఖార్సైన నిజాలను నిగ్గు తేల్చే అవకాశాన్ని కోల్పోయింది. 

ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా ప్రజా సమ స్యలను శాసనసభలో ప్రస్తావించి, సమర్థవంతంగా పాలకుల దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉంటుంది. నేటి ప్రజాస్వామ వ్యవస్థ లో విపక్ష నేతలకు ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు శాసనసభలే అత్యుత్తమ మార్గం. దీనికి మరో ప్రత్యామ్నాయం మాత్రం లేదు. అయితే ప్రధాన సమస్యలు చర్చకు వచ్చినప్పుడు విపక్షానికి, పాలక పక్షానికి చెందిన శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలను వాదనలు, ప్రతివాదనలకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

కానీ శాసనసభ సమా వేశాల పట్ల దాటివేత ధోరణి ప్రదర్శిస్తూ, బయట మీడియా ముందు మాత్రం అడ్డగోలుగా మాట్లాడడం అలవాటైపోయింది. మీ డియా ముందు ఎగిరే ప్రధాన ప్రతిపక్ష నా యకులు ఈసారి శాసనసభ, శాసన మం డలి శీతాకాల సమావేశాలను ఎందుకు బ హిష్కరించారో సమాధానం చెప్పాలి? సమస్యలు అడగాల్సిన చోటుకు ముఖం ఎందు కు చాటేశారో చెప్పాలి? బలహీనమైన కారణాలు చూపుతూ వాక్ అవుట్‌ల పేరుతో స భా సమయాన్ని వృథా చేయడం వెనుక కార ణం ఏంటో చెప్పాలి? పాలమూరు ఎత్తిపోతలపై, కృష్ణానది నీటి పంప కాలపై చర్చలు జరుగుతున్న వేళ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం ఇ లా సమావేశాలను బాయ్‌కాట్ చేసి తమ బాధ్యతలను విస్మరించడమే అవుతుంది. దీనివల్ల ప్రతిపక్ష హోదాలో తమ బాధ్యతలు నిర్వహించినట్టా లేదా? అన్నది చెప్పాలి. బాయ్‌కాట్‌లతో ప్రజా సమస్యలు గాలికి వ దిలేసినట్టే కదా అని ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు ప్రతిపక్షం సమాధానం చెప్పాలి.

సందేశాలు అర్ధరహితం..

ప్రస్తుత శాసనసభను బహిష్కరించడం వల్ల ప్రతిపక్షం తమ హయాంలో జరిగిన అసలు వాస్తవాలు సభ దృష్టికి తీసుకువచ్చి, ప్రజల ముందు నిఖార్సైన నిజాలను నిగ్గు తేల్చే అవకాశాన్ని కోల్పోయింది. ఈ సమావేశాల బహిష్కరణతో నాయకులు ప్రజలకు ఏమి సంకేతాలను పంపిస్తున్నారనేది అర్థం కాని విషయం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన నాయకులు ఏమీ చెప్ప కుండానే బహిష్కరణల పేరుతో సందేశాలను ఇస్తుండడం అర్ధరహితం.

ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లో ఉప నాయకుడిగా ఉన్న వ్యక్తి అప్పుడే కాడి కింద పడేసి మీడియా పాయిం ట్ దగ్గర ‘చెరువు మీద అలిగినట్టు.. ఏదో ప్ర జాస్వామ్యం కూనీ అయినటు’ ఎప్పటిలాగే అధికార పక్షంపై ఆరోపణలు చేస్తూ యాం త్రికంగా జనాంత్రికంగా మాట్లాడారు. అయి తే ప్రస్తుత పార్టీ ఉపనాయకుడి స్థానంలో అదే పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఇలా బాయ్‌కాట్ చేసి ఉండేవాడు కా దని తెలంగాణ పౌర సమాజం భావిస్తున్న ది.

ఈ చర్యలతో విపక్షం.. పాలమూరు ప్రాజెక్టు గురించి అధికార పక్షం చేసే ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడమో లేక ఎదుర్కొనే మహత్తర అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నట్లయింది. బీఆర్‌ఎస్ హయాంలో ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రివర్యులు హరీశ్ రావు పాలమూరు ప్రాజెక్టుపైన చేసిన ప్రత్యారో పణలు వాస్తవమైతే ఎందుకు ఈ శాసనసభ సమావేశాలను బహిష్కరించారనేది ఆయనే చెప్పాలి.

బహిష్కరించడానికి హరీశ్ రావు చెబుతున్న కారణాలు తూతూమంత్రంగానే ఉన్నాయని తెలంగాణ పౌర సమాజం, ము ఖ్యంగా పాలమూరు జిల్లా వాసు లు అనుకుంటున్నారు. ఆయన చెప్పే కారణాలు సమర్థింపుగా ఉన్నాయే తప్ప వాదన కు బలంగా నిలబడేలా మాత్రం కనిపించ డం లేదు. అధికారికంగా శాసనసభకు హాజరై డాక్యుమెంట్ల ఆధారంగా వాదనలకు దిగాల్సింది పోయి బాయ్‌కాట్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఏమైనా ఉందా అని రాజకీయ విశ్లేషణ నిపుణులు చెవులు తెగ ఆలోచిస్తున్నారు.

అవన్నీ ‘ఆఫ్ ది రికార్డేగా’!

శాసనసభ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన తర్వాత అనధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి భవన్‌లో తమ అడుగులకు మడుగులొత్తే తమ పార్టీకే చెందిన నాయకులతోనే సమావేశం పెట్టడం వల్ల ఎవరికీ ప్ర యోజనం చేకూరుతుందో ఆలోచించుకోవాలి. అంతటితో ఊరుకోకుండా ‘తనను విడిచిన అమ్మ ఊరంతా చెప్పినట్లు’.. అదే తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలపైన అవాకు లు, చెవాకులు మాట్లాడడం సబబు కాదనిపిస్తున్నది.

పైగా శాసనసభలో అధికారికంగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ సదరు ఉప నాయకుడు అక్కడ బాయ్‌కాట్ చేసి.. ఇంటి బయట ఎన్ని చిలుక పలుకులు పలికినా అ వన్నీ ఆఫ్ ది రికార్డుగా మిగిలిపోతాయి తప్ప వాటిని ఈ తెలంగాణ సమాజం పెద్దగా ప ట్టించుకోదన్న విషయం తెలుసుకోవాలి. అంతేగాక ఈ చర్యతో బీఆర్‌ఎస్ నాయకులు శాసనసభ సమావేశాలను ముందస్తు వ్యూ హాంతోనే బహిష్కరించారనే కీడు తలెత్తే వి ధంగా పరిస్థితికి స్వయంగా ఉప నాయకుడే దగ్గరుండి మరీ ఆస్కారం కల్పించినట్టయింది.

 కక్కలేక మింగలేక..

ఇకపోతే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపైన ప్రధాన ప్రతిపక్షం లేనప్పుడు అధికార పార్టీ నాయకులు సదరు నది శుద్ధీకరణ విషయం లో చాలా నిర్ణయాలు, మరెన్నో విషయాలను తెరమీదకు తీసుకొచ్చి మాట్లాడారు. మజ్లిస్ పార్టీ, బీజేపీ నాయకులు అనేక ప్రశ్న లు సంధిస్తే వాటికి సూటిగా, ధీటుగా సమాధానాలు కూడా చెప్పారు. దీనిపైన కూడా ఉప నాయకుడు మీడియా పాయింట్‌లో నూ, తమ బీఆర్‌ఎస్ నాయకుల సమావేశంలో.. కమీషన్లు, ఇతరత్రా కథా కమామీ షులను ధారావాహికగా ఏకరువు పెట్టుకోవడం గమనార్హం. మరి దానిలో పస ఎంత ఉందో..అసలు పొల్లు ఎంత ఉందో ఆయనకే తెలియాలి.

హైదరాబాద్ కార్పొరేషన్ గురించి ముఖ్యమైన బిల్లు ప్రవేశపెట్టినపుడు కూడా చాలా మంది శాసనసభ్యులు వారి వారి సందేహాలు, అనుమానాలు వెలిబుచ్చారు. శాసనసభ్యుల సందేహాలను, అను మానాలన్నింటికీ అధికార పక్షం తీరిగ్గా సమయం తీసుకొని మరి సమాధానం చె ప్పింది. ఈసారి శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులకు సంబంధించి మంచి, చెడులపైన ప్రజల కోణంలో మాట్లాడకుండా బీఆర్‌ఎస్ పార్టీ బాధ్యతారాహిత్యం గా ప్రవర్తించింది.

‘చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నటు’ అన్న చందానా సమావేశాలు బహిష్కరించిన తర్వాత ఆ పార్టీ శాసనసభ్యులు.. ‘తప్పు చేశామా’ అని గుసగుసలా డుకుంటున్నారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు.. ఈ దృశ్యం పట్ల, తీసుకున్న నిర్ణ యం పట్ల ‘కక్కలేక మింగలేక’ అన్న చందాన పరిస్థితి మారిపోయింది. ఈ విషయంలో తమను తాము సమర్ధించుకునే సమయం కూడా దాటిపోయింది.

చేజేతులా..

గత రెండు సంవత్సరాలుగా శాసనసభలోను, తాము ఏర్పాటు చేసిన సభల్లో కూ డా అధికార పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమం హామీలపై, అవినీతి ఆరోపణలపై, బంధుప్రీతి, కమీషన్లు ఇత్యాది వాటిని ప్రధాన ప్రతి పక్ష నాయకులు చూపుడు వేలును ఎత్తిచూపడం ద్వారా.. మిగతా నాలుగు వేళ్లు తమ వైపు చూపిస్తున్నట్టుగానే ఉంటుందే తప్ప తెలంగాణ సమాజం మరో విధంగా భావించడానికి తావు లేకుండా పోయింది. ఈ విష యాన్ని బీఆర్‌ఎస్ అధినాయకులు ఇక ముందైనా గమనించి మసలుకుంటే వారికి, తెలంగాణ సమాజానికి శ్రేయస్కరం.

అంతేకాదు దీనివల్ల తెలంగాణ ఒక స్పష్టమైన దిశా, దశ  తీసుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఏది ఏమైనా శాసనసభ  కన్ఫెషన్ బాక్స్ ముందు నిటారుగా నిలబడి వాస్తవాలను తెలంగాణ సమాజానికి గొంతెత్తి తెలి యజెప్పే సందర్భాన్ని బీఆర్‌ఎస్ నాయక త్వం చేజేతులా పోగొట్టుకుంది. ఈ బాయ్‌కాట్ వల్ల అధికార పక్షానికి.. గత తెలంగాణ ప్రభుత్వాన్ని పాలించిన నాయకుల పనితీ రు, నీటి పంపకాలపై తీసుకున్న నిర్ణయాలతో పాటు అనేకానేక ప్రజా వ్యతిరేక విధా నాలను ఎండగట్టినట్టు అయిపోయింది. 

 వ్యాసకర్త సెల్: 9441078095